ఎగుమతి పరపతిపై జూన్‌ దాకా రాయితీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ భారతీయ ఎగుమతిదారులకు తోడ్పాటు కొనసాగించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 09 Dec 2023 05:15 IST

ఈ పథకానికి మరో రూ.2,500 కోట్లు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ భారతీయ ఎగుమతిదారులకు తోడ్పాటు కొనసాగించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ, పోస్ట్‌ షిప్‌మెంట్‌ రూపీ ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ (ఎగుమతి పరపతి)పై రాయితీ పథకాన్ని వచ్చే ఏడాది జూన్‌ 30 దాకా కొనసాగించడం కోసం రూ.2,500 కోట్లు అదనంగా కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ఎగుమతిదారులతో పాటు ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని రంగాల ఎగుమతిదారులు తక్కువ వడ్డీకే ఎగుమతి పరపతి పొందేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఈ రాయితీ పథకాన్ని 2015 ఏప్రిల్‌ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

జనపనార సంచుల్లోనే ఆహారధాన్యాలు..

దేశంలో ఆహారధాన్యాలను మూట కట్టి ఉంచేందుకు ఇకపై పూర్తిగా జనపనార సంచులనే వినియోగించాల్సి ఉంటుంది. 20% పంచదారనూ వాటిలోనే నిల్వ చేయడం తప్పనిసరి. కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు 2023-24 జనపనార సంవత్సరానికిగాను ప్యాకేజింగ్‌ ప్రమాణాలకు ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా జనపనార మిల్లుల్లో, వాటి అనుబంధ యూనిట్లలో ఉపాధి పొందుతున్న 4 లక్షల మంది కార్మికులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని