కుంగిపోలేదు.. కెరటంలా లేచాడు

ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు.

Published : 11 Dec 2023 07:40 IST

జంటహత్యల నిందతో జైలుపాలై.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డ మేరఠ్‌ యువకుడు

ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమిత్‌ చౌధరి(30) కథ దీనికి పూర్తి భిన్నం. తన చుట్టూ అల్లుకున్న చిక్కుముళ్లను తానే ఛేదించుకొని నిర్దోషిగా బయటపడి జీవితాన్ని గెలిచిన స్ఫూర్తిగాథ ఇది. అమిత్‌ చౌధరి చేయని నేరానికి.. 12 ఏళ్ల క్రితం మేరఠ్‌లో జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకేసులో అరెస్టయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ ముద్ర కూడా వేశారు. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్‌ మేరఠ్‌లోనే లేడు. శామ్లీ పట్టణంలోని తన సోదరి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో అమిత్‌ను కూడా చేర్చారు. కైల్‌ అనే వ్యక్తికి చెందిన ముఠాలో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో అమిత్‌ రెండేళ్లపాటు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

సంక్షోభాన్ని సదవకాశంగా తీసుకొని..

తన జీవితంలో అనుకోకుండా తలెత్తిన ఈ తుపానును సదవకాశంగా మార్చుకోవాలని అమిత్‌ నిర్ణయించుకున్నారు. ఓ రైతు కొడుకైన ఈయన.. జైలు జీవితం గడుపుతున్న సమయంలో ఎందరో నేరస్థులు వారి ముఠాల్లో చేరాలని ప్రలోభపెట్టినా అమిత్‌ తలొగ్గలేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఓ జైలరు సహకరించారు. అమిత్‌ను గ్యాంగ్‌స్టర్‌లు ఉండే బ్యారక్‌లలో కాకుండా వేరే చోటుకు మార్చారు. ఇలా రెండేళ్ల జైలు జీవితం తర్వాత 2013లో అమిత్‌ బెయిలు మీద విడుదలయ్యారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ద్వారా తన కుటుంబం తిరిగి తలెత్తుకొని తిరిగేలా చేయాలని అమిత్‌ నిశ్చయించుకున్నారు. కుంగుబాటు ఆలోచనలను పక్కన పెట్టి.. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. బార్‌ కౌన్సిల్‌ పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యాక.. చట్టపరమైన అంశాలపై వచ్చిన పట్టుతో తన కేసును తానే చేపట్టారు.

లాయర్‌గా చూసి.. గుర్తుపట్టని పోలీసు అధికారి

పోలీసులు మొదట్లో ఎలాంటి స్టేట్‌మెంట్లు, ఆధారాలు సేకరించకపోవడంతో ఈ కేసు నత్తనడకన సాగిందని అమిత్‌ తెలిపారు. తాను పూర్తిగా ఈ కేసుపైనే దృష్టి సారించి కోర్టులో వాదనలు వినిపించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఓసారి ఆయనను అరెస్టుచేసిన పోలీసు అధికారి బోనులో నిలబడాల్సి వచ్చింది. న్యాయవాదిగా కేసు వాదిస్తున్న తనను ఆ అధికారి గుర్తుపట్టకపోవడం జడ్జిని ఆశ్చర్యానికి గురిచేసిందని అమిత్‌ వెల్లడించారు. దీంతో ఈ కేసులో నిందితుల పేర్లను ఎంత గుడ్డిగా చేర్చారో న్యాయమూర్తికి అర్థమైందన్నారు. జంటహత్యల్లో తన ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించే ఒక్క ఆధారాన్నీ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారని అమిత్‌ తెలిపారు. ఆయనతోపాటు మొత్తం 13 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని