‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలను రూపొందించే బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Published : 13 Dec 2023 04:14 IST

సుప్రీం తీర్పునకు అనుగుణంగా తీసుకొచ్చాం
అధికారాల విభజనను అనుసరించాం: కేంద్రం
కాదు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: కాంగ్రెస్‌

దిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలను రూపొందించే బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ‘ద చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు-2023ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

1991 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 10వ తేదీన  రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అందులో ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనల్లేవని పేర్కొంటూ ఈ బిల్లును తెచ్చింది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటిదాకా సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేదని, ఇక నుంచీ సెర్చి, ఎంపిక కమిటీలు ఆ బాధ్యతలను నిర్వహిస్తాయని వివరించారు. వేతనాలకు సంబంధించిన సవరణలూ బిల్లులో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని, మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తి కలిగించలేదని ఆరోపిస్తూ సభ నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని తప్పుబట్టాయి. వాకౌట్ చేసిన పార్టీల్లో సమాజ్‌వాదీ, డీఎంకే, తృణమూల్‌, ఆప్‌, జేఎంఎం ఉన్నాయి.

చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకే

రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకే ఈ బిల్లును తెచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పునూ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా (కాంగ్రెస్‌)  వ్యాఖ్యానించారు. ఎంపిక కమిటీని నిర్వీర్యం చేశారని, తాజా బిల్లు ద్వారా ప్రధాని, ఆయన నియమించిన సభ్యులే అందులో ఉంటారని పేర్కొన్నారు.

పలు సవరణలతో..

సీఈసీ, ఈసీ హోదాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ల బిల్లులో సవరణలు చేసింది. గతంలో మాదిరిగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదాను కొనసాగించాలని నిర్ణయించింది.

కశ్మీర్‌, పుదుచ్చేరిల బిల్లు

జమ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరిలలోని చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా వాటికి ఆమోదం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని