మూడంచెల భద్రత కళ్లుగప్పి

దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంటులో బుధవారం చోటుచేసుకున్న ఘటన అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది.

Updated : 14 Dec 2023 04:45 IST

అడుగడుగునా తనిఖీలను ఏమార్చి..
పార్లమెంటులోకి గ్యాస్‌ క్యాన్లను తెచ్చిన దుండగులు

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంటులో బుధవారం చోటుచేసుకున్న ఘటన అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. అది కూడా 22ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగిన డిసెంబరు 13నే కావడం సంచలనంగా మారింది. తాజా ఘటనతో పార్లమెంటులో భద్రతా వ్యవస్థపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అసలు ఎలాంటి భద్రత ఉంటుంది? ఎవరెవర్ని అనుమతిస్తారో తెలుసుకుందాం..

నాటి ఉగ్ర దాడితో ఆంక్షలు..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్‌ భారతం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పార్లమెంటులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాంగణంలోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, సహాయకులు మినహా ఎవరికీ అనుమతి లేదు. సందర్శకులు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంటు సభ్యుల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్‌ పొంది విజిటర్స్‌ పాస్‌లు తీసుకోవాలి. సందర్శకుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పాస్‌లను ఇస్తుంటారు. వీరి ప్రవర్తనకు సంబంధించి ఆయా పార్లమెంటు సభ్యులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

పటిష్ఠమైన భద్రత ఉన్నా..

ఇక పార్లమెంటు భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంటుకు వచ్చే సిబ్బంది, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్‌ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంటు ప్రాంగణంలోని ప్రవేశ ద్వారంవద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంటు భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్‌వద్ద మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్‌ గ్యాలరీకి వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీ చేస్తారు. పార్లమెంటులో పని చేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంటులో పని చేసే ప్రతి సిబ్బందినీ గుర్తించేలా ఉంటారు. పార్లమెంటులో పని చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీ కార్డులు ధరించాలి. సమయానుసారం సిబ్బందిని తనిఖీ చేస్తారు. మెటల్‌ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లు, ఫుల్‌ బాడీ స్కానర్ల వంటి అధునాతన పరికరాలతో పార్లమెంటు పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు.


వలయాన్ని దాటుకుని లోపలికి ఎలా?

ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ బుధవారం నాటి ఘటన ఎలా జరిగిందన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. లోక్‌సభలో సందర్శకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు దుండగులు సభలో గందరగోళం సృష్టించారు. పార్లమెంటు భవనం వెలుపల మరో ఇద్దరు ఈ పొగ గొట్టాలతో కలకలం రేపారు. మెటల్‌ డిటెక్టర్లు, మూడంచెల తనిఖీలను దాటుకుని దుండగులు పార్లమెంటు భవనం లోపలికి ఆ రంగుల పొగ గొట్టాలను ఎలా తీసుకొచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ముందు రోజే దరఖాస్తు చేసుకుంటే ఒక్కో ఎంపీకి రోజుకు ఇద్దరు, అదే రోజు దరఖాస్తు చేసుకుంటే ఒక సందర్శకుడికి అనుమతి ఇస్తున్నారు. వీళ్లు రిసెప్షన్‌ నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. అక్కడే స్కానింగ్‌ మిషన్‌తోపాటు మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపుతారు. సెల్‌ఫోన్లు, తాళాలు, పర్సులు, దువ్వెనలు, చేతి రుమాళ్లు ఏవి ఉన్నా బయటపెట్టి పోవాల్సిందే. ప్రతి సందర్శకుడిని రిసెప్షన్‌లోకి ప్రవేశించేటప్పుడు, పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టేటప్పుడు, గ్యాలరీలోకి ప్రవేశించే ముందు  మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి పంపుతారు. సందర్శకులు గ్యాలరీలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి వరుసకు ఆ చివర, ఈ చివర భద్రతా సిబ్బంది కూర్చుని అందర్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరూ సభలోకి తొంగి చూడకుండా ఉండటానికి గ్యాలరీ మొదటి వరుసలో భద్రతా సిబ్బందిని తప్పితే సందర్శకులను అనుమతివ్వరు. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లున్నా ఒక వ్యక్తి దూకడం, మరో వ్యక్తి రైలింగ్‌ పట్టుకుని దూకడానికి కొంతసేపు పెనుగులాడి మరొకరి సాయంతో లోపలికి ప్రవేశించడం అన్నది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని