పార్లమెంటులో అలజడి ఘటన వెనుక పెద్ద వ్యక్తులు?

పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి.

Updated : 15 Dec 2023 08:53 IST

నిందితుల తల్లిదండ్రులు, బంధువుల అనుమానం

దిల్లీ, కోల్‌కతా: పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి. ఈ కుట్ర వెనుక పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు దాగి ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. తమవారు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు వెల్లడించాయి.

సాగర్‌ను కుట్రలోకి లాగారేమో..

‘సాగర్‌ను ఈ కుట్రలోకి లాగారు. ఈ కుట్రలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల హస్తం ఉండి ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తులే సాగర్‌ను ఇరికించి ఉంటారు. చిన్న వ్యక్తులే ఇరుక్కుంటారు. పెద్ద వ్యక్తులు తప్పించుకుంటారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలి. నా సోదరికి సాగర్‌ ఒక్కడే కుమారుడు. సాగర్‌ బయట తిరిగే వ్యక్తి కాడు. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే ఇతర నిందితులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. సాగర్‌ వంటి చిన్న వ్యక్తులవద్ద రాష్ట్రాలు దాటి తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి’ అని సాగర్‌ మేనమామ ప్రదీప్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

‘మనోరంజన్‌కు నేర నేపథ్యం లేదు’

పార్లమెంటులో అలజడి ఘటన నిందితుడైన మనోరంజన్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. భగత్‌ సింగ్‌ ఫ్యాన్‌ క్లబ్‌తో అతడికి సంబంధం ఉన్నట్లు తేలిందని వెల్లడించాయి. మనోరంజన్‌కు విప్లవ భావాలు ఉన్నాయని పేర్కొన్నాయి.

‘సైనిక నియామక శిక్షణకు నెలకు రూ.4వేలు కావాలన్నాడు’

పార్లమెంటు వెలుపల పొగ వదిలిన కేసులో అరెస్టైన అమోల్‌ శిందే సైనిక నియామకాల్లో పాల్గొన్నాడు. దీని కోసం అస్సాం వరకూ వెళ్లివచ్చాడు. ఎంపిక కాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. శిక్షణ తీసుకునేందుకు నెలకు రూ.4వేలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు తమవద్ద లేవని చెప్పారు. ఆ తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘లాతూర్‌ వెళ్లి శిక్షణ తీసుకోవాలని అమోల్‌ మమ్మల్ని డబ్బు అడిగాడు. నెలకు రూ.4వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అంత డబ్బు సర్దలేమని మేం చెప్పాం. ఇప్పటికే చదువులకు చాలా ఖర్చవడంతో అంత డబ్బు తేలేమని తెలిపాం’ అని అమోల్‌ తల్లి వెల్లడించారు.

లలిత్‌ ఝా బెంగాల్‌వాసి

పార్లమెంటులో అలజడి ఘటనకు మాస్టర్‌మైండ్‌గా ఉన్న లలిత్‌ ఝా కోల్‌కతాలోని బుర్రాబజార్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. కోల్‌కతా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అక్కడి వెళ్లి ఇంటి యజమానిని లలిత్‌ ఝా గురించి అడిగారు. అతడు సమయానికి అద్దె చెల్లించేవాడు కాదని, స్థానికులతో అంతగా పరిచయాలు లేవని యజమాని చెప్పారు. ఎక్కువగా ఎవరితోనూ లలిత్‌ మాట్లాడేవాడు కాదని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న ఓ ఎన్‌జీవోలో లలిత్‌ ఝా పనిచేసేవాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని