Odisha: రాత్రి వేళ లారీ డ్రైవర్లకు.. ఉచితంగా ఒడిశా ప్రభుత్వం టీ పంపిణీ

రహదారులపై రాకపోకలు సాగించే లారీల డ్రైవర్లకు రాత్రిళ్లు ఉచితంగా టీ పంపిణీ చేయాలని ఒడిశా రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి టుకుని సాహు తెలిపారు.

Updated : 22 Dec 2023 08:14 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రహదారులపై రాకపోకలు సాగించే లారీల డ్రైవర్లకు రాత్రిళ్లు ఉచితంగా టీ పంపిణీ చేయాలని ఒడిశా రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి టుకుని సాహు తెలిపారు. గురువారం భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రహదారులపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారని చెప్పారు. శిరస్త్రాణాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని ఇప్పటికే జనచైతన్యం కల్పిస్తున్నామన్నారు. సరకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటుంటారని, అలాంటి సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా వాటిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, వాటిలో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలుంటాయని తెలిపారు. చాయ్‌, కాఫీలు అందుబాటులో ఉంటాయని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని