పూంఛ్‌ సెక్టార్‌లో 30మంది ఉగ్రవాదులు

పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పూంఛ్‌ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది.

Published : 23 Dec 2023 05:45 IST

భారత సైన్యం అంచనా
మొదలైన గాలింపు చర్యలు

శ్రీనగర్‌: పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పూంఛ్‌ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. ఈ దాడుల ప్రణాళికలో పాకిస్థాన్‌-చైనాలు సహకరించుకుంటున్నట్లు రక్షణశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో చైనా-భారత్‌ బలగాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొనడంతో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ రైఫిల్స్‌ను పూంఛ్‌ సెక్టార్‌ నుంచి లద్దాఖ్‌కు తరలించారు. అదే అదనుగా భావించిన పాకిస్థాన్‌.. తమ ఉగ్రవాదులను పూంఛ్‌ సెక్టార్‌లోకి పంపించడం మొదలుపెట్టింది. ఇలా వచ్చిన ముష్కరులు భారత సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో లద్దాఖ్‌లో మోహరించిన భారత సైన్యాన్ని కశ్మీర్‌కు మళ్లించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్‌-చైనాలు సహకరించుకుంటూ పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు రక్షణశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో పూంఛ్‌ అటవీ ప్రాంతంలో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు నక్కినట్లు భావిస్తున్నాయి. వీరి జాడను పసిగట్టేందుకు స్నిఫర్‌ డాగ్‌లు, డ్రోన్ల సాయంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటవీప్రాంతంలో భారీ ఎత్తున భద్రత బలగాలు శుక్రవారం గాలింపు చర్యలు ప్రారంభించాయి. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ బృందంతో కలిసి దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రదేశానికి దగ్గరలో అనుమానాస్పద రీతిలో మూడు మృతదేహాలను సైన్యం శుక్రవారం గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని