మణిపుర్‌లో ఉగ్రకాల్పులు.. ఇద్దరు పోలీసు కమాండోల మృతి

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లోని మోరేలో బుధవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించారు.

Updated : 18 Jan 2024 06:02 IST

మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి గాయాలు

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లోని మోరేలో బుధవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తూటా గాయాలకు గురయ్యారు. మృతులు సోమోర్జిత్‌ (32), తఖేల్లంబం శైలేశ్వర్‌లను పశ్చిమ ఇంఫాల్‌ జిల్లా వాసులుగా గుర్తించారు. ఇమా కొండోంగ్‌ లైరెంబీ దేవి ఆలయం వద్ద ఉదయం సోమోర్జిత్‌ను ఉగ్రవాదులు కాల్చారు. తీవ్రంగా గాయపడిన ఆయన అస్సాం రైఫిల్స్‌కు చెందిన కీ లొకేషన్‌ పాయింట్‌ (కేఎల్‌పీ)లో చికిత్స పొందుతూ మరణించారు. సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో శైలేశ్వర్‌ అమరుడయ్యారు. కానిస్టేబుల్‌ ఎన్‌.భీమ్‌ (35) ఎడమకాలిలో బులెట్‌ గాయం కాగా,  ఏఎస్‌ఐ సిద్ధార్ద్‌ థోక్‌చోమ్‌ (35) ముఖం, చెవులకు గాయాలయ్యాయి. ఆయన్ను ఇంఫాల్‌లోని రిమ్స్‌కు చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు. ఎస్‌బీఐ మోరే యూనిట్‌ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీసు స్థావరంపై ఉగ్రవాదులు రాకెట్‌ ఆధారిత గ్రనేడ్‌ను పేల్చడంతో రెండువైపులా కాల్పులు మొదలయ్యాయని అధికారులు వివరించారు. దాడిలో పోస్ట్‌ వద్దనున్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

అయిదుగురిపై సీబీఐ చార్జిషీటు

నిరుడు మే నెలలో మణిపుర్‌ పోలీసు శిక్షణ కేంద్ర ఆయుధాగారం నుంచి రైఫిళ్లు, ఇతర ఆయుధాలను లూటీ చేసిన అయిదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చార్జిషీటు దాఖలు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. అస్సాంలోని కామరూప్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఇటీవలే చార్జిషీటును సమర్పించారు. సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న అయిదుగురిలో ఆనంద్‌ సింగ్‌ అనే వ్యక్తి నిషిద్ధ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మాజీ సభ్యుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని