Union Budget: నేడే కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

సార్వత్రిక ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల  భారీ అంచనాల నడుమ.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది.

Updated : 01 Feb 2024 08:10 IST

పీఎం కిసాన్‌ సాయం పెంపు?
చమురు, వంటగ్యాస్‌ ధరల తగ్గింపుపైనా ఊహాగానాలు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల  భారీ అంచనాల నడుమ.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో గురువారం ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు పూర్తిస్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు! అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ సర్కారు.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో- 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా.. మౌలిక  వసతుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందనీ అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనుండటం ఇది వరుసగా ఆరోసారి. మోదీ ప్రభుత్వం-2కు ఇదే చివరి పద్దు. గత పదేళ్లలో తమ సర్కారు సాధించిన విజయాలను తెలియజేస్తూ.. ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నదీ సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కవరేజీ పెంపు?

మధ్యంతర పద్దుతో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రస్తుతం కల్పిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చనీ వార్తలొస్తున్నాయి. సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటుచేయాలని కేంద్రం లక్షిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలను ఆశించొచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు- సర్కారు తమపై కరుణ చూపి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని