జ్ఞానవాపిలో తెరచుకున్న వ్యాస్‌జీ మందిరం

జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్‌లోని వ్యాస్‌జీ మందిరం తలుపులు 31 ఏళ్ల తర్వాత బుధవారం రాత్రి తెరచుకున్నాయి.

Updated : 02 Feb 2024 06:00 IST

మూడు దశాబ్దాల తర్వాత పూజలు
అలహాబాద్‌ హైకోర్టులో మసీదు కమిటీ పిటిషన్‌

వారణాసి: జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్‌లోని వ్యాస్‌జీ మందిరం తలుపులు 31 ఏళ్ల తర్వాత బుధవారం రాత్రి తెరచుకున్నాయి. అక్కడున్న లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిమలకు హారతి, అర్చన నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్టు అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. దీని కోసం పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సీలువేసిన సెల్లార్‌ మార్గాన్ని తెరిచారు. రాత్రి 9.30 గంటల సమయంలో మందిరాన్ని శుభ్రం చేశారని, 10.30కి హారతి ఇచ్చారని అధికారులు తెలిపారు. అంతకుముందు మసీదు ప్రాంగణంలోని వజూఖానాకు ఎదురుగా ఉన్న నంది విగ్రహం చెంతనున్న బారికేడ్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. అయితే, సెల్లార్‌లో పూజలకు వారం రోజుల్లో ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను వారణాసి కోర్టు ఆదేశించగా... గంటల వ్యవధిలోనే హడావుడిగా తలుపులు తెరవాల్సిన అవసరం ఏమిటని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు.  మసీదులో శుక్రవారం ప్రార్థనలకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.


హైకోర్టుకు వెళ్లండి: సుప్రీం

దిల్లీ: వ్యాస్‌జీ మందిరంలో పూజల నిర్వహణకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి సత్వరమే కేసు విచారణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌.. సీజేఐ దృష్టికి తీసుకెళ్లగా.. అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అవతలి పక్షంతో కుమ్మక్కై వెంటనే పూజలు ప్రారంభమయ్యేలా చేసిందని మసీదు కమిటీ ఆరోపించింది. ఈ మేరకు అలహాబాద్‌     హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని