కాలచక్రం మనవైపు మారింది

కాలచక్రం మనదేశం వైపు మారిందని, కొత్త శకం తలుపులు తడుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్‌ అనే ఆలయాన్ని పునర్నిర్మించే కర్తవ్యాన్ని దైవం తనకు అప్పగించిందని చెప్పారు.

Published : 20 Feb 2024 05:49 IST

ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తున్నాం
‘భారతాలయ’ పునర్నిర్మాణ కర్తవ్యాన్ని దైవం నాకు ఇచ్చింది
యూపీలో కల్కి ధామ్‌ ఆలయ శంకుస్థాపనలో ప్రధాని వెల్లడి
రెడ్‌టేప్‌ స్థానంలో రెడ్‌ కార్పెట్‌ సంస్కృతి వచ్చిందని వ్యాఖ్య
రూ.10 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన

సంభల్‌ (యూపీ), లఖ్‌నవూ: కాలచక్రం మనదేశం వైపు మారిందని, కొత్త శకం తలుపులు తడుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్‌ అనే ఆలయాన్ని పునర్నిర్మించే కర్తవ్యాన్ని దైవం తనకు అప్పగించిందని చెప్పారు. మన ప్రాచీన శిల్పాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నామని, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. ఇతరులను అనుసరించే స్థితి నుంచి అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి తొలిసారిగా ఎదిగామని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో కల్కిధామ్‌ ఆలయానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి ప్రసంగించారు. లఖ్‌నవూలో మరో కార్యక్రమంలో రూ.10 లక్షల కోట్ల విలువైన 14,500 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రెండుచోట్లా ప్రసంగించారు. భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా కల్కిధామ్‌ ఆవిర్భవిస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

ఉద్దేశం మంచిదైతే ఎవరూ అడ్డుకోలేరు

‘‘దేశంలో తీర్థక్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆలయాలతో పాటు వైద్య కళాశాలలు కొత్తగా వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడేళ్లుగా నడుస్తున్న ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారుతో పెట్టుబడిదారులకు రెడ్‌టేప్‌ (అలసత్వ) సంస్కృతి బదులు రెడ్‌కార్పెట్‌ (ఎర్రతివాచీతో స్వాగతం) కనిపిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఉపాధి అవకాశాలు యూపీలో ఉంటాయని ఏడెనిమిదేళ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. అప్పట్లో నేరాలు, అల్లర్లు నిత్యకృత్యం. యూపీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఎవరిలోనూ లేదు. కేంద్రంలో, యూపీలో భాజపా సర్కారు వచ్చాక పరిస్థితులు మారాయి. ఉద్దేశం మంచిదైతే అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని రుజువైంది’’ అని ప్రధాని చెప్పారు.

వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాం

వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కి, ప్రకృతి సేద్యంపై, చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించేలా ప్రభుత్వం చేయూత అందిస్తోందని మోదీ తెలిపారు. భారతదేశ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్‌ టేబుళ్లపై కనిపించాలని ఆకాంక్షించారు. పవిత్ర నదుల పరిశుభ్రతకు హాని కలిగించకుండా ఆహారశుద్ధి పరిశ్రమలు పనిచేయాలని సూచించారు. నవకల్పనలకు, డిజిటల్‌ సాంకేతికతకు కేంద్రంగా మన దేశం గుర్తింపు పొందుతోందన్నారు. కల్కి ధామ్‌ పుణ్యక్షేత్రాన్ని 108 అడుగుల ఎత్తున అయిదెకరాల్లో నిర్మించనున్నారు. ఈ దేవాలయంలో 10వ గర్భగుడిలో కల్కి అవతారం ఉంటుంది. మోదీ మంగళవారం జమ్మూలో రూ.30,500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని