విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్‌ కన్నుమూత

ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్‌ నారీమన్‌ (95) ఇకలేరు.

Published : 22 Feb 2024 04:58 IST

దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ
70 ఏళ్లపాటు సేవలు
ప్రధాని, సీజేఐతోపాటు పలువురి సంతాపం

ఈనాడు, దిల్లీ: ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్‌ నారీమన్‌ (95) ఇకలేరు. భారతీయ న్యాయ వ్యవస్థలోని ‘కేశవానంద భారతి’లాంటి ఎన్నో కీలక కేసుల్లో పాలు పంచుకున్న ఆయన బుధవారం ఉదయం దిల్లీలో కన్నుమూశారు. గుండె జబ్బుతోపాటు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నారీమన్‌కు కుమారుడు రోహింటన్‌ నారీమన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), కుమార్తె అనహీత ఉన్నారు. ఆయన సతీమణి బాప్సీ నారీమన్‌ 2020లో మరణించారు. ఖాన్‌ మార్కెట్‌ సమీపంలోని పార్శీ ఆరంగాలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు బహదూర్‌షా జఫర్‌ మార్గ్‌లోని పార్శీ అంజుమన్‌లో ప్రార్థనా సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. నారీమన్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణసహా పలువురు సంతాపం తెలిపారు. 

న్యాయ వ్యవస్థలో మేటి

ఫాలీ ఎస్‌ నారీమన్‌ 1929 జనవరి 10న మయన్మార్‌లోని రంగూన్‌లో (ప్రస్తుతం యాంగూన్‌) జన్మించారు. ఆయనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మయన్మార్‌ను జపాన్‌ ఆక్రమించుకోవడంతో భారత్‌కు కుటుంబంతోసహా వలస వచ్చారు. సిమ్లాలోని బిషప్‌ కాటన్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ముంబయిలోని సెయింట్‌ జేవియర్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌ అండ్‌ హిస్టరీలో బీఏ పూర్తి చేశారు. 1950లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి లా పట్టా అందుకున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో అక్కడ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 22 ఏళ్లపాటు ముంబయిలో ప్రాక్టీసు చేసిన తర్వాత 1972లో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. అనంతరం న్యాయ వ్యవస్థలో 70 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా, రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా దేశానికి ఆయన అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 1991లో పద్మ భూషణ్‌, 2007లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను అందించి గౌరవించింది. సగటు ఎత్తుతో చూపరులకు సాధారణంగా కనిపించే ఆయన తన గంభీరమైన స్వరంతో దశాబ్దాలపాటు న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. తండ్రి ఆయనను బ్యూరోక్రాట్‌గా చూడాలనుకున్నా.. న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో న్యాయ వ్యవస్థను సుసంపన్నం చేసిన ప్రఖ్యాత రాజ్యాంగ న్యాయ నిపుణులు హెచ్‌ఎం సీర్వాయ్‌, నానీ పాల్కీవాలా, సోలీ సొరాబ్జీ, పరాశరణ్‌ల సరసన చేరారు. భారత న్యాయ చరిత్రలో అత్యున్నత న్యాయవాదిగా నిలిచారు. న్యాయస్థానాల్లో ఎంత గట్టిగా వాదనలు వినిపించేవారో బయట ప్రభుత్వాలకు వ్యతిరేకంగానూ అంతే గట్టిగా మాట్లాడిన వ్యక్తిగా నారీమన్‌ గుర్తింపు పొందారు. 1972లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన ఆయన 1975 జూన్‌ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు నిరసనగా మరుసటి రోజే రాజీనామా చేశారు. నర్మదా ప్రాజెక్టు పునరావాసం కేసులో గుజరాత్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన అక్కడ క్రైస్తవులను వేధిస్తున్నారని తెలిసి ఆ కేసు నుంచి వైదొలిగారు. మనసుతో ఆలోచిస్తూనే హృదయంతో న్యాయం చేయాలన్నది ఆయన భావన. 1991 నుంచి 2010 వరకూ దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నారీమన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 1999 నుంచి 2005 వరకూ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ‘బిఫోర్‌ ద మెమరీ ఫేడ్స్‌, ద స్టేట్‌ ఆఫ్‌ ద నేషన్‌, ఇండియాస్‌ లీగల్‌ సిస్టం: కెన్‌ ఇట్‌ బి సేవ్డ్‌?, గాడ్‌ సేవ్‌ ద హానరబుల్‌ సుప్రీంకోర్టు’ పుస్తకాలను నారీమన్‌ రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని