మధ్యవర్తిత్వ సంబంధ సంస్కరణలపై న్యాయశాఖకు నిపుణుల కమిటీ నివేదిక

మధ్యవర్తిత్వం అంశంలో సంస్కరణలకు సంబంధించి మాజీ న్యాయ కార్యదర్శి టీకే విశ్వనాథన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ న్యాయశాఖకు నివేదిక సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Published : 22 Feb 2024 04:29 IST

 సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: మధ్యవర్తిత్వం అంశంలో సంస్కరణలకు సంబంధించి మాజీ న్యాయ కార్యదర్శి టీకే విశ్వనాథన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ న్యాయశాఖకు నివేదిక సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నివేదికపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమిటీ సభ్యుల్లో ఒకరైన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నివేదికను సంబంధిత పక్షాలకు మార్చి 1 లోపు అందజేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. మధ్యవర్తిగా ఉండటానికి అర్హత లేని వ్యక్తి మరో వ్యక్తిని ఆ హోదాకు నామినేట్‌ చేయడానికి వీలు లేదని సర్వోన్నత న్యాయస్థానం 2017, 2020ల్లో స్పష్టం చేసింది. అయితే 2020లో మరో సందర్భంలో మధ్యవర్తి అర్హతలు లేని వ్యక్తి నామినేట్‌ చేసిన వ్యక్తిని మధ్యవర్తిగా ఉండటానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ అంశాన్ని పరిశీలించడానికి 2023 జూన్‌లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. మరోవైపు భారత్‌ను మధ్యవర్తిత్వ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణలను ప్రతిపాదించేందుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని