సీబీఐ దర్యాప్తుపై బెంగాల్‌ పిటిషన్‌.. అత్యవసర విచారణకు ఆదేశించలేం: సుప్రీం

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణ జాబితాలో చేర్చే విషయమై ఉత్తర్వులివ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 22 Feb 2024 04:30 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణ జాబితాలో చేర్చే విషయమై ఉత్తర్వులివ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ నుంచి చట్ట ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తూ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. దీన్ని సవాల్‌ చేస్తూ తాము గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం 9 సార్లు వాయిదా వేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. అందుకే బుధ లేదా గురువారం విచారణ జరిపేలా అత్యవసర విచారణ జాబితాలో చేర్చేందుకు ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించింది. దీనికి సీజేఐ అంగీకరించలేదు. ‘ఈ అంశం నా పరిధిలోనిది కాదు. మీరు ఆ ధర్మాసనానికే వెళ్లండి. వారే నిర్ణయం తీసుకుంటారు’ అని స్పష్టం చేశారు. ‘ఈ పిటిషన్‌ విచారణ కోసం కొన్ని రోజులు వేచి చూడొచ్చు. అంత అత్యవసరం లేద’ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అనగా.. 2021లో పిటిషన్‌ దాఖలు చేశాం.. ఇప్పుడు 2024లో ఉన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ బదులిచ్చారు. రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించడానికి సీబీఐకి ఇచ్చిన ‘సాధారణ సమ్మతి’ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2018లోనే ఉపసంహరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని