సిక్కు అధికారికి అవమానంపై నిరసన

పశ్చిమ బెంగాల్లో సిక్కు ఐపీఎస్‌ అధికారిని ‘ఖలిస్థానీ’ అంటూ భాజపా నేతలు వ్యాఖ్యానించడాన్ని పలు సిక్కు సంఘాలు ఖండించాయి.

Published : 22 Feb 2024 04:32 IST

కోల్‌కతా, దిల్లీ: పశ్చిమ బెంగాల్లో సిక్కు ఐపీఎస్‌ అధికారిని ‘ఖలిస్థానీ’ అంటూ భాజపా నేతలు వ్యాఖ్యానించడాన్ని పలు సిక్కు సంఘాలు ఖండించాయి. దాదాపు 200 మంది సిక్కులు బుధవారం కోల్‌కతాలోని భాజపా కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మంగళవారం సందేశ్‌ఖాలీలో పర్యటనకు వెళ్లిన భాజపా నేతలు సువేందు అధికారి తదితరులు ఐపీఎస్‌ అధికారి జస్‌ప్రీత్‌ సింగ్‌ను ఖలిస్థానీ అని విమర్శించారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అయితే తాము ఖలిస్థానీ అని అనలేదని బుధవారం భాజపా నేతలు సువేందు అధికారి, అగ్నిమిత్ర పాల్‌ వివరణ ఇచ్చారు. ఆయన తన విధులను సక్రమంగా నిర్వహించడంలేదని మాత్రమే ఆరోపించామని పేర్కొన్నారు. భాజపా నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ అసన్‌సోల్‌లోనూ సిక్కులు ఆందోళన నిర్వహించారు. భాజపా నేతల వ్యాఖ్యలను పంజాబ్‌లోని పలు సిక్కు సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి. భాజపా నేతలు సిక్కు అధికారికి క్షమాపణలు చెప్పాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండు చేసింది.

గవర్నర్‌ చర్యను స్వాగతించిన ఇద్దరు టీఎంసీ ఎంపీలు

హింస చెలరేగిన సందేశ్‌ఖాలీలో వేధింపులకు గురైన మహిళల కోసం రాజ్‌భవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలను బుధవారం ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీలు స్వాగతించారు. గవర్నర్‌ను అభినందించాలంటూ కొంటాయ్‌ ఎంపీ సిసిర్‌ అధికారి, తామలుక్‌ ఎంపీ దివ్యేందు అధికారి పేర్కొన్నారు. భాజపా నేత సువేందు అధికారికి సిసిర్‌ స్వయానా తండ్రి. సిసిర్‌ రెండో సంతానం దివ్యేందు. వీరిద్దరూ తృణమూల్‌లోనే ఉన్నా.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని