మేం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం

హరియాణాతో సరిహద్దుల్లో నిరసన కారులు గుమిగూడేందుకు తాము అనుమతిస్తున్నామని కేంద్రం ఆరోపించడం సరికాదని పంజాబ్‌ సర్కారు పేర్కొంది.

Published : 22 Feb 2024 04:36 IST

 హరియాణాతో సరిహద్దుల్లో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాం
  కేంద్రం లేఖపై పంజాబ్‌ స్పందన

చండీగఢ్‌: హరియాణాతో సరిహద్దుల్లో నిరసన కారులు గుమిగూడేందుకు తాము అనుమతిస్తున్నామని కేంద్రం ఆరోపించడం సరికాదని పంజాబ్‌ సర్కారు పేర్కొంది. హరియాణా పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలు, డ్రోన్ల వల్ల ఇప్పటిదాకా 160 మంది రైతులు గాయపడ్డారని వెల్లడించింది. అయినప్పటికీ తమ సర్కారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షిస్తోందని పేర్కొంది. అన్నదాతల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది. పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పంజాబ్‌ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.

‘భారీ యంత్రాలను తొలగించండి’

శంభు, ఖనౌరీల నుంచి పొక్లెయిన్లు, ఎక్స్‌కేవేటర్లు సహా ఇతర భారీ యంత్రాలను తొలగించాలని రైతులను హరియాణా పోలీసులు ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14 వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ-గురుగ్రామ్‌, దిల్లీ-బహదూర్‌గఢ్‌ సహా ఇతర ప్రాంతాల్లో బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

ముజఫర్‌నగర్‌లో నిప్పంటించుకున్న రైతు

పంటలకు మద్దతు ధర కల్పించడం సహా పలు డిమాండ్లతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ కలెక్టరేట్‌ వద్ద వందల మంది అన్నదాతలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిజ్‌పాల్‌ అనే రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ఆయన తనకు తాను నిప్పంటించుకున్నారు. సహచర రైతులు సకాలంలో మంటలు ఆర్పివేయడంతో బ్రిజ్‌పాల్‌ ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు- రైతులు దిల్లీలో ప్రవేశించకుండా కేంద్రం అడ్డుకుంటుండటంపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయిత్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రవేశించకుండా నాయకులను రైతులు అడ్డుకుంటారని హెచ్చరించారు.

రాహుల్‌ గాంధీ సంతాపం

ఖనౌరీ వద్ద యువ రైతు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. గత నిరసనల సమయంలో ప్రధాని మోదీ అహం వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు శత్రువుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని