వివాహం కారణంతో మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేరు: సుప్రీం

వివాహాన్ని కారణంగా చూపుతూ మహిళలను ఉద్యోగం నుంచి తొలగించే ఏ చట్టాన్నైనా రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Updated : 22 Feb 2024 05:59 IST

దిల్లీ: వివాహాన్ని కారణంగా చూపుతూ మహిళలను ఉద్యోగం నుంచి తొలగించే ఏ చట్టాన్నైనా రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  ఇటువంటి పితృస్వామ్య ఆలోచనలు సమానత్వ హక్కును, మానవ నైతికతను నిర్వీర్యం చేస్తాయంది. వివాహానంతరం మహిళా ఉద్యోగుల హక్కులను హరించే నియమాలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. సైన్యంలో నర్సుగా సేవలు అందించిన సెలినా జాన్‌ను వివాహం కారణంగా 1988లో కేంద్రం విధుల నుంచి తొలగించింది. ఈ కేసుపై వాదనలను విన్న ధర్మాసనం.. 26 ఏళ్ల ఆమె న్యాయ పోరాటానికి తెరదించింది. అన్ని బకాయిలతో కలిపి రూ.60 లక్షలు ఆమెకు చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. విధుల నుంచి తొలగించినప్పుడు సెలినా జాన్‌ సైన్యంలో లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై తొలుత ఆమె అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనంతరం 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వెంటనే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను సవాలుచేస్తూ కేంద్రం 2019లో అత్యున్నత న్యాయ స్థానాన్ని సంప్రదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ట్రైబ్యునల్‌ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని పేర్కొంది. రెండు నెలల్లోగా సెలినాకు రూ.60 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని