చెరకు గిట్టుబాటు ధర పెంపు

చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.340 చేసింది. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 22 Feb 2024 04:58 IST

 మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో పథకం
అంతరిక్ష రంగంలోకి 100% ఎఫ్‌డీఐలకు అనుమతి
కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
రైతులతో చర్చలకు సిద్ధమని ప్రకటన

ఈనాడు, దిల్లీ: చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.340 చేసింది. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెల పరిరక్షణను ప్రోత్సహించాలని, అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని తీర్మానించింది. కనీస మద్దతు ధరలపై రైతులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కేబినెట్‌ బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకుంది. అన్నదాతల ఆందోళనతో దిల్లీ సరిహద్దు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ నిర్ణయాలు వెలువడటం గమనార్హం. సమావేశానంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.

  • 2024-25 సీజనుకు సంబంధించి చెరకు ఎఫ్‌ఆర్‌పీ (ఫెయిర్‌ అండ్‌ రెమ్యూనరేటివ్‌ ప్రైస్‌) ధరను క్వింటాల్‌కు రూ.340గా కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 2023-24తో పోలిస్తే ఇది 8% అధికం. ఈ సవరించిన ధరలు 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.
  • మహిళల రక్షణ కోసం చేపట్టే అంబ్రెల్లా పథకానికి రూ.885 కోట్లను కేంద్ర హోంశాఖ తన బడ్జెట్‌ నుంచి అందిస్తుంది. మిగిలిన రూ.294 కోట్లను నిర్బయ నిధి ద్వారా సమకూరుస్తుంది. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు, ప్రాసిక్యూట్‌ చేసే అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపడతారు. అలాగే మహిళా సహాయ కేంద్రాలు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
  • దేశంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌లో మార్పులు చేసింది. వీటి సంరక్షణ కోసం ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 50% మూలధన సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్‌ లయబిలిటీ గ్రూప్స్‌, ఎఫ్‌సీవోలు, సెక్షన్‌ 8 కంపెనీలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ ఇందులో సబ్సిడీ అందిస్తారు. గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంరక్షణకు వీలుగా వీర్య కేంద్రాలు, పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10కోట్ల వరకూ ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పాడి పశువుల బీమా కార్యక్రమాన్నీ సరళీకరించింది. ప్రస్తుతం లబ్ధిదారులు చెల్లించాల్సిన 20, 30, 40, 50% ప్రీమియంను 15%కి తగ్గించింది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40నిష్పత్తిలో పంచుకుంటాయి. బీమా చేయదగ్గ పశువుల సంఖ్యనూ 5 నుంచి 10కి పెంచింది. 
  • అంతరిక్ష రంగంలో ఎఫ్‌డీఐ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందులో 100% వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చింది.

మార్చి 3న కేంద్ర మంత్రి మండలి భేటీ

సార్వత్రిక ఎన్నికలకు మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని