దిగ్గజ రేడియో ప్రయోక్త అమీన్‌ సాయానీ మృతి

దిగ్గజ రేడియో ప్రయోక్త అమీన్‌ సాయానీ (91) ఇక లేరు. ‘బినాకా గీత్‌ మాలా’ షోతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రేడియో శ్రోతలను తన అమృత గళంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉర్రూతలూపిన సాయానీ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు.

Published : 22 Feb 2024 04:40 IST

ముంబయి: దిగ్గజ రేడియో ప్రయోక్త అమీన్‌ సాయానీ (91) ఇక లేరు. ‘బినాకా గీత్‌ మాలా’ షోతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రేడియో శ్రోతలను తన అమృత గళంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉర్రూతలూపిన సాయానీ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం ఆయన కుమారుడు రజిల్‌ తెలిపారు ‘‘సాయంత్రం ఆరు గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించాం. ఏడు గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు’’ అని రజిల్‌ పేర్కొన్నారు. అంత్యక్రియలు గురువారం జరుగుతాయని తెలిపారు. 1932, డిసెంబరు 21న సాయానీ ముంబయిలో జన్మించారు. 42 ఏళ్ల రేడియో కెరీర్‌లో 50 వేలకు పైగా షోలకు తన గళాన్ని అందించారు. ముఖ్యంగా రేడియో సిలోన్‌ నుంచి ప్రసారమైన హిందీ సినిమా పాటల ‘బినాకా గీత్‌మాలా’ కార్యక్రమం ఆయనకు అపార పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. ‘‘బెహనో ఔర్‌ భాయయో, మై ఆప్‌ కా దోస్త్‌ సాయానీ బోల్‌ రహా హూ’’ అంటూ ప్రతి బుధవారం రేడియోలో వినిపించే ఆయన గొంతు కోసం లక్షలాది మంది శ్రోతలు వేచి చూసేవారు. 1952 నుంచి 88 వరకు ఈ షో.. రేడియో సిలోన్‌ నుంచి ప్రసారమైంది. తర్వాత 1994 వరకు వివిధ భారతిలో కొనసాగింది. తమకు నచ్చిన హిందీ సినీ గీతాలను ప్రసారం చేయమంటూ ఈ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా ఉత్తరాలు రాసేవారు.సాయానీ మృతికి  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని