ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర

సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చిరస్మరణీయ తీర్పుల్లో న్యాయవాదిగా ఫాలీ ఎస్‌ నారీమన్‌ ప్రముఖ పాత్ర పోషించారు.

Updated : 22 Feb 2024 07:07 IST

న్యాయ వ్యవస్థలో ఫాలీ ఎస్‌ నారీమన్‌ కీలకపాత్ర

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చిరస్మరణీయ తీర్పుల్లో న్యాయవాదిగా ఫాలీ ఎస్‌ నారీమన్‌ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదని 1967లో గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థకు ప్రాణం పోస్తూ 1993లో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘సెకండ్‌ జడ్జెస్‌’ తీర్పులోనూ ఆయన భూమిక కనిపిస్తుంది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులోనూ ఆయన పాత్ర ఉంది. ఆర్టికల్‌ 30కింద మైనారిటీల హక్కులను ఖరారు చేస్తూ టీఎంఏ పాయ్‌ ఫౌండేషన్‌ కేసులో 11 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనూ ఫాలీ నారిమన్‌ వాదనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆయన చివరగా సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరఫున వాదనలను వినిపించారు. నారీమన్‌ అనేక ప్రతిష్ఠాత్మక కేసుల్లో తన వాదనలను వినిపించారు. భోపాల్‌ గ్యాస్‌ విపత్తు కేసులో యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీకి అనుకూలంగా నారీమన్‌ వాదించారు. ఆ తర్వాత తన తప్పును అంగీకరించి నష్ట పరిహారం విషయంలో బాధితులకు, కంపెనీకి మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల అధికరణం 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు. జయలలిత అక్రమాస్తుల కేసునూ వాదించారు.

పలువురి నివాళి

అజరామర సేవలతో అజాత శత్రువుగా పేరు పొందిన నారీమన్‌ మరణంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశం గర్వించదగ్గ అత్యుత్తమ న్యాయ కోవిదులు, మేధావుల్లో నారీమన్‌ ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం చేసేందుకు ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్ను ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థలో ఒక దిగ్గజాన్ని కోల్పోవడం ఎంతో బాధిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. నారీమన్‌ మృతి పట్ల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్వాతంత్య్రానికి ముందు, తర్వాత దేశం ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. చివరి శ్వాసవరకూ రాజ్యాంగ విలువలను కాపాడటానికి కట్టుబడి పని చేశారు. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే వ్యక్తి. న్యాయస్థానాల్లో వాదనలు, పత్రికల్లో వ్యాసాలు, బహిరంగ ప్రసంగాలు, పార్లమెంటులో ప్రసంగాలు, టీవీల్లో ఇంటర్వ్యూల ద్వారా కొన్నితరాలపాటు న్యాయవాదులతోపాటు సాధారణ ప్రజలనూ చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు. నైతిక దిగ్గజంగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. రాజ్యాంగ పవిత్రతను నిలబెట్టేందుకు అనేక తరాల న్యాయ నిపుణులకు ఫాలీ నారీమన్‌ స్ఫూర్తినిచ్చారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కొనియాడారు. నారీమన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారీమన్‌ మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా సంతాపం తెలిపారు. నారీమన్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

అమరావతి రాజధాని, హైకోర్టు తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటూ అమరావతి రైతులు, దళిత, మైనారిటీలు కలిసి చేసిన న్యాయ పోరాటానికి దిశా నిర్దేశం చేసి న్యాయస్థానాల్లో వారికి న్యాయం దక్కేలా చేసిన ఆ మహనీయుడి మరణం తమకు తీరని లోటని అమరావతి జేఏసీ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ.. నారీమన్‌ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో ఒక యుగం ముగిసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ, ప్రజా జీవితంలో ఉన్నవారి మనసుల్లో నారీమన్‌ చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. భారత్‌ గొప్ప న్యాయవాదిని కోల్పోయిందని, నారీమన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని