నిరసనల్లో హింస

అన్నదాతల ఆందోళనతో పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది.

Published : 22 Feb 2024 04:43 IST

యువ రైతు మృత్యువాత
పోలీసులే చంపేశారంటున్న అన్నదాతలు
ఖనౌరీ వద్ద యుద్ధ వాతావరణం
బాష్పవాయు గోళాల ప్రయోగంతో శంభు వద్ద ఉద్రిక్తతలు
రెండు రోజులపాటు ‘దిల్లీ చలో’ నిలిపివేత

చండీగఢ్‌, దిల్లీ: అన్నదాతల ఆందోళనతో పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు తీవ్ర గాయమై ఓ యువరైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులూ గాయపడ్డారు. 12 మంది పోలీసు సిబ్బందికి  గాయాలయ్యాయి. శంభు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతు నాయకులు అప్రమత్తమయ్యారు. ‘దిల్లీ చలో’ నిరసనను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ భవిష్యత్‌ కార్యాచరణను శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. అప్పటివరకు అన్నదాతలు శంభు, ఖనౌరీ శిబిరాల్లోనే కొనసాగనున్నారు. మరోవైపు- శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకుందామంటూ రైతులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

పరుగులు తీసిన రైతన్నలు

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో ‘దిల్లీ చలో’ ఆందోళనను తలపెట్టిన అన్నదాతలు ఈ నెల 13 నుంచి పంజాబ్‌-హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద వేల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. నాలుగు దఫాల చర్చలు విఫలం కావడంతో.. తమ డిమాండ్లపై బుధవారం ఉదయం 11 గంటల కల్లా స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వారు మంగళవారం డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. సర్కారు నుంచి తగిన స్పందన లేకపోవడంతో బుధవారం ‘దిల్లీ చలో’ నిరసనను పునఃప్రారంభించారు. శంభు, ఖనౌరీల్లో బహుళ అంచెల బారికేడ్లను దాటి దిల్లీ దిశగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు పలు దఫాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతాలను భారీఎత్తున పొగ కమ్మేసింది. తమను తాము కాపాడుకునేందుకు రైతన్నలు పరుగులు తీశారు. బాష్పవాయువు ప్రభావాన్ని తప్పించునేందుకు పలువురు అన్నదాతలు మాస్కులు, కళ్లద్దాలు ధరించి కనిపించారు.

రబ్బరు తూటాల ప్రయోగం!

ఖనౌరీ వద్ద ఘర్షణల్లో శుభ్‌కరణ్‌ సింగ్‌ అనే యువ రైతు కన్నుమూశాడు. ఆయన వయసు 21 ఏళ్లు. పంజాబ్‌లోని బఠిండా జిల్లావాసి. ఖనౌరీలో పోలీసులతో ఘర్షణల్లో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరైన శుభ్‌కరణ్‌ మరణించాడని రైతు నాయకులు తెలిపారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హెచ్‌.ఎస్‌.రేఖి తెలిపారు. తమ ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుభ్‌కరణ్‌ మరణించాడని చెప్పారు. ఆయన తలకు తూటా గాయాన్ని గుర్తించామన్నారు. మరిన్ని వివరాలు శవపరీక్షలో తెలుస్తాయని పేర్కొన్నారు. హరియాణా పోలీసులు తమపైకి బాష్పవాయు గోళాలతో పాటు రబ్బరు తూటాలనూ ప్రయోగించారని ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొన్న రైతులు తెలిపారు. ‘దిల్లీ చలో’ ఆందోళన ప్రారంభమయ్యాక ఘర్షణల్లో చోటుచేసుకున్న తొలి మరణం ఇదే కావడం గమనార్హం. మరోవైపు- నిరసనకారులు తమపైకి రాళ్లు రువ్వడంతో 12 మంది సిబ్బంది గాయపడ్డారని హరియాణా పోలీసులు పేర్కొన్నారు. వారు లాఠీలతోనూ దాడి చేశారన్నారు. బలగాలను చుట్టుముట్టి.. పంటవ్యర్థాలపై కారం చల్లి నిప్పంటించారని కూడా పేర్కొన్నారు. ఆ పొగ వల్ల సిబ్బందికి శ్వాస, కంటిచూపు సంబంధిత సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

శాంతంగా ఉండాలంటూ రైతు నాయకుల పిలుపు

సరిహద్దుల్లో శాంతంగా ఉండాలంటూ నిరసనకారులకు రైతు నాయకులు పిలుపునిచ్చారు. బారికేడ్లను దాటి ముందుకెళ్లొద్దంటూ యువ రైతులకు పలువురు వాలంటీర్లు (రైతుసంఘాలు నియమించినవారు) సూచిస్తుండటం శంభు, ఖనౌరీల్లో కనిపించింది. రైతు నాయకుడు జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ శంభు వద్ద నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొన్ని విద్రోహ శక్తులు నిరసనల్లో చొరబడి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని, వాటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘మీరు గెలవాలనుకుంటున్నారా? లేదా’ అని రైతులను ఉద్దేశించి ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. దిల్లీ వైపు తాము శాంతియుతంగానే సాగుతామన్నారు. ఎవరైనా ఎక్స్‌కేవేటర్లను తీసుకొస్తే అడ్డుకుంటామని స్పష్టంచేశారు. అన్నదాతల డిమాండ్లపై కేంద్రం కాలయాపన వ్యూహాన్ని ప్రయోగిస్తోందంటూ మండిపడ్డారు. మరో రైతు నాయకుడు శర్వాణ్‌సింగ్‌ పంధేర్‌ శంభు వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. ఖనౌరీలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. తాజా ఉద్రిక్తతలకు ప్రభుత్వానిదే బాధ్యత అని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆరోపించింది. గురువారం తమ సంఘం భేటీ కానున్నట్లు తెలిపింది. రైతు మృతిని పంజాబ్‌ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు నిరసనకారులకు పంజాబ్‌ సర్కారు అండగా నిలుస్తోందని కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. తాజా పరిణామాలు  పొరుగురాష్ట్రాలైన పంజాబ్‌-హరియాణాల మధ్య ఓ రకంగా ఉద్రిక్తతల్ని రాజేస్తున్నాయి.

మరోసారి చర్చిద్దాం రండి: కేంద్రం

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సహా అన్ని అంశాలపై మరోసారి (అయిదో దఫా) తమతో చర్చలకు రావాలని రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా ఆహ్వానించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని వారికి విన్నవించారు. పంజాబ్‌, హరియాణా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ముండా దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని