రైతుల సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత

పంటల కనీస మద్దతు ధరల చట్టబద్ధత కోసం ఉద్యమిస్తున్న వేళ...రైతుల సామాజిక మాధ్యమ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది.

Published : 23 Feb 2024 05:56 IST

177 హ్యాండిల్స్‌పై తాత్కాలిక నిషేధం
అభ్యంతరం వ్యక్తంచేస్తూనే కేంద్రం ఆదేశాలను పాటించిన ‘ఎక్స్‌’
కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రిట్‌ అప్పీల్‌
ప్రభుత్వ చర్యను దుయ్యబట్టిన కాంగ్రెస్‌

దిల్లీ: పంటల కనీస మద్దతు ధరల చట్టబద్ధత కోసం ఉద్యమిస్తున్న వేళ...రైతుల సామాజిక మాధ్యమ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కర్షకుల నిరసనలతో ముడిపడిన 177 ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) ఖాతాలను నిలిపివేయాలని సామాజిక మాధ్యమ సంస్థను ఆదేశించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం రైతుల నిరసనలతో ముడిపడిన సామాజిక మాధ్యమ ఖాతాలను నిలిపివేసినట్లు ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యంలోని ‘ఎక్స్‌’ ప్రకటించింది. అదే సమయంలో సర్కారు ఆదేశాలతో విభేదిస్తున్నట్లూ పేర్కొంది. కేంద్రం నిర్ణయం భావన ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని తెలిపింది. కేంద్ర హోంశాఖ సూచన మేరకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను జారీ చేసిందని, పాటించకపోతే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదంటూ అందులో పేర్కొన్నారని ‘ఎక్స్‌’ వెల్లడించింది.

భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలి:ఎక్స్‌

భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించిన్లట్లు సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌’ బుధవారం రాత్రి ఒక పోస్ట్‌లో ప్రకటించింది. అయితే, తమ వేదికపై ప్రతి ఒక్కరికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది. భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలుచేస్తూ రిట్‌ అప్పీలు దాఖలు చేసినట్లు  పేర్కొంది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఖాతాలు నిలిపివేయడం వల్ల ప్రభావితమైన ఖాతాదారులకు కంపెనీ విధానాల మేరకు ప్రభుత్వ చర్యలపై నోటీసులు పంపినట్లు చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేయలేకపోతున్నామని తెలిపింది. కానీ, పారదర్శకత కోసం వాటిని అందరిముందు ఉంచడం అవసరమని పేర్కొంది. లేదంటే జవాబుదారీతనం లోపిస్తుందని, ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని భావిస్తున్నట్లు ఎక్స్‌ తన ‘గ్లోబల్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌’ హ్యాండిల్‌లో చేసిన పోస్టులో వివరించింది. ఎక్స్‌ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇది ప్రజాస్వామ్య హత్యే: రాహుల్‌ గాంధీ

దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మద్దతు ధర కోరిన రైతులపై కాల్పులు జరపడం, ఉద్యోగాలు కోరుతున్న యువత మాట ఆలకించకపోవడం, వాస్తవాలను వెల్లడించిన మాజీ గవర్నర్‌ ఇంటికి సీబీఐని పంపించడం...ఇదేనా ప్రజాస్వామ్య మాతృక?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. ‘మోదీజీ...మీరు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ప్రజలకు తెలుసు. వాళ్లే తగిన శాస్తి చేస్తారు’ అని హెచ్చరించారు. ‘భారత దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని