నేడు బ్లాక్‌ డే

దిల్లీ చలో సందర్భంగా యువ రైతు మృతి కేసులో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేంఎం) డిమాండు చేసింది.

Published : 23 Feb 2024 05:56 IST

ఖట్టర్‌పై హత్య కేసు పెట్టాలి
యువ రైతు మృతిపై నేతల డిమాండ్‌
26న జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ

చండీగఢ్‌: దిల్లీ చలో సందర్భంగా యువ రైతు మృతి కేసులో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేంఎం) డిమాండు చేసింది. శుక్రవారం రైతులు బ్లాక్‌ డే పాటించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 26వ తేదీన అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొంది. ఆ రోజున అఖిల భారత కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌నూ ఏర్పాటు చేశామని తెలిపింది. యువ రైతు మృతికి గురువారం రైతులు దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. బుధవారం దిల్లీ చలో సందర్భంగా బఠిండాకు చెందిన 21 ఏళ్ల శుభకరణ్‌ సింగ్‌ మరణించిన నేపథ్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. పంజాబ్‌, హరియాణా సరిహద్దులోని పరిస్థితులపై గురువారం రైతు నేతలు సమావేశమై చర్చించారు. యువ రైతు మృతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. రూ.కోటి పరిహారం చెల్లించాలని కోరారు. యువ రైతుది హత్యేనని ఎస్‌కేఎం నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండు చేశారు. చనిపోయిన రైతుకు రూ.16 లక్షల రుణం ఉందని, దానిని మాఫీ చేయాలని మరో రైతు నేత దర్శన్‌ పాల్‌ కోరారు. శుభకరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ డిమాండు చేశారు. మరోవైపు రైతు సంఘాలన్నీ కలిసి పోరాడేందుకు వీలుగా రాజేవాల్‌, ఉగ్రహణ్‌, దర్శన్‌ పాల్‌ తదితరులతో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది.

  • నొయిడా, గ్రేటర్‌ నొయిడా రైతులు శుక్రవారం తలపెట్టిన దిల్లీ మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. అధికారులు, పోలీసులతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతు నేతలు గురువారం తెలిపారు.
  • రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది. అలాగే పంజాబ్‌ అసెంబ్లీనీ సమావేశపరచాలని సూచించింది. రైతులు దేశానికి వెన్నెముకలాంటి వారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గురువారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
  • భారత్‌, గ్రీస్‌లలో జరుగుతున్న రైతుల ఆందోళనల్లో సారూప్యముందని గ్రీస్‌ ప్రధాని కిరియాకొస్‌ మిట్సోటకిస్‌ వ్యాఖ్యానించారు. భారత్‌, గ్రీస్‌లకు సంబంధించిన సారూప్య అంశాల్లో ఇదీ ఒకటని అభిప్రాయపడ్డారు. గురువారం ముంబయిలో గ్రీస్‌, ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించి ప్రతి డిమాండునూ నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే చరిత్రాత్మక నిర్ణయం వెలువడింది. చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించింది. దీంతో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది’ అని మోదీ పేర్కొన్నారు.

చర్చలకు ఎప్పుడూ సిద్ధమే: ఠాకుర్‌

పలు డిమాండ్ల సాధనకై దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన అన్నదాతలతో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. రైతుల ఆందోళనలకు చర్చలు ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. వారు ఈ దేశానికి అన్నదాతలని.. వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. యూపీఏ పాలనతో పోలిస్తే.. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రైతులకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించామని చెప్పారు.


రైతు మృతి బాధాకరం
చర్చలు కొనసాగించాలి: వెంకయ్య నాయుడు

రైతుల ఆందోళనల సందర్భంగా ఓ అన్నదాత మృతి చెందడం దురదృష్టకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ అనుకూలమైన ఫలితం వచ్చేలా చర్చలు జరగాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.


ఈయూలోని 10 దేశాల రైతుల నిరసన

ప్రేగ్‌: ఐరోపా కూటమిలోని (ఈయూ) 10 దేశాల రైతులు తమ ఆందోళనల్లో భాగంగా దేశాల సరిహద్దులకు ట్రాక్టర్లను తరలించారు. ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈయూ వ్యవసాయ విధానాలపై నిరసన తెలిపారు. 27 దేశాల ఈయూ కూటమి పర్యావరణ నిబంధనలు రసాయనాల వాడకాన్ని నియంత్రిస్తున్నాయని, వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని భారీగా పెంచుతున్నాయని, తమ వ్యాపారం దెబ్బ తింటోందని, ఈయూయేతర దేశాల దిగుమతుల వల్ల నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని