‘గుల్‌మార్గ్‌’లో భారీ హిమపాతం

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో గురువారం భారీ హిమపాతం బీభత్సం సృష్టించింది. మంచు చరియలు విరిగిపడటంతో రష్యాకు చెందిన స్కీయర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Published : 23 Feb 2024 04:05 IST

మంచు చరియలు విరిగిపడి రష్యా జాతీయుడి మృతి
ఏడుగురిని కాపాడిన సహాయక బృందాలు
మరోచోట ఓ కార్మికుడి దుర్మరణం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో గురువారం భారీ హిమపాతం బీభత్సం సృష్టించింది. మంచు చరియలు విరిగిపడటంతో రష్యాకు చెందిన స్కీయర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంచులో కూరుకుపోయిన ఏడుగురిని సహాయక బృందాలు కాపాడాయి. అఫర్వాత్‌ పర్వత ప్రాంతంలోని ఖిలాన్‌ మార్గ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గైడ్‌ పర్యవేక్షణలో ఏడుగురు రష్యన్‌ స్కీయర్ల బృందం స్కీయింగ్‌ చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో మంచు చరియలు విరిగిపడటంతో హంటెన్‌ అనే వ్యక్తి మృతి చెందారు. మిగిలిన వారిని ఆర్మీ, స్థానిక పోలీసు దళాలు రక్షించి ఆసుపత్రికి తరలించాయి. మంచు చరియల ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు స్కీయింగ్‌కు వెళ్లినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి సమీపంలో కొండచరియలు విరిగిపడి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేశ్‌పాల్‌ అనే కార్మికుడు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. హిమపాతం కారణంగా మంచు చరియలు విరిగిపడుతుండటంతో ఈ రహదారిని సోమవారం నుంచి మూసివేశారు. దీంతో మూడు రోజులుగా ఓ బస్సులో చిక్కుకుపోయిన 80 మందిని గురువారం సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది. వారిలో రాజస్థాన్‌ న్యాయ కళాశాలకు చెందిన 74 మంది విద్యార్థులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్తంభించిన పలు రహదారులు

గ్యాంగ్‌టక్‌: భారీ హిమపాతం కారణంగా  హిమాచల్‌ ప్రదేశ్‌లో 400కు పైగా రహదారులు, ఉత్తర, తూర్పు సిక్కింలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న పలు రహదారులు మూసుకుపోయాయి. లాచుంగ్‌, లాచెంగ్‌ యాక్సిస్‌ వెంట ఉన్న రహదారులపై రాకపోకలు స్తంభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు