సందేశ్‌ఖాలీలో మళ్లీ నిరసనలు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో గురువారం మళ్లీ నిరసనలు పెల్లుబికాయి. రోడ్లపైకి వచ్చిన స్థానికులు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు షాజహాన్‌ షేక్‌, అతడి సోదరుడు సిరాజ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Published : 23 Feb 2024 04:27 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో గురువారం మళ్లీ నిరసనలు పెల్లుబికాయి. రోడ్లపైకి వచ్చిన స్థానికులు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు షాజహాన్‌ షేక్‌, అతడి సోదరుడు సిరాజ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిరాజ్‌కు చెందిన ఓ నిర్మాణానికి నిప్పంటించారు. తమ భూములను తిరిగివ్వాలని డిమాండు చేశారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో డీజీపీ రాజీవ్‌ కుమార్‌ పర్యటించారు. మహిళలపై హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ను సందేశ్‌ఖాలీలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో సందేశ్‌ఖాలీ చేరిన ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. హింసలో కీలక నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేయాలని డిమాండు చేశారు. అతడిని అదుపులోకి తీసుకునేంత వరకూ ధర్నా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన సుకాంత బరాసత్‌లో మార్చి 6న భాజపా మహిళా విభాగం నిర్వహించే ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొంటారని వెల్లడించారు. దీంతో ప్రధాని సందేశ్‌ఖాలీ బాధితులనూ కలవనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌టీ) జిల్లాలో పర్యటించింది. వేధింపులు, భూ అక్రమాలపై తమకు 23 ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా వెల్లడించింది. అందులో ఓ రాజకీయ నాయకుడి పేరు ఉందని తెలిపింది.

‘రిపబ్లిక్‌ బంగ్లా జర్నలిస్టుకు బెయిలు

సందేశ్‌ఖాలీలో ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తూ అరెస్టైన రిపబ్లిక్‌ బంగ్లా జర్నలిస్టు సంతు పాన్‌కు గురువారం కోల్‌కతా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసులో తదుపరి విచారణపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో భూ ఆక్రమణలు, మహిళలపై అఘాయిత్యాలను వివరిస్తూ భాజపా గురువారం ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని