సంక్షిప్త వార్తలు (4)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జియాపై రూపొందిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌ విడుదలను బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

Updated : 23 Feb 2024 06:28 IST

ఇంద్రాణీ ముఖర్జియాపై డాక్యుమెంటరీ విడుదల వారంపాటు నిలుపుదల

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జియాపై రూపొందిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌ విడుదలను బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఈ నెల 22న విడుదల కావాల్సి ఉన్న ఈ డాక్యుమెంటరీని 29 వరకు ప్రసారం చేయొద్దని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. ఆలోపు ఈ డాక్యుమెంటరీని సీబీఐ ముందు ప్రదర్శించాలని సూచించింది.


భారతీయ విద్యార్థులతో వర్చువల్‌ భేటీ

వాషింగ్టన్‌: అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. 90 విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది విద్యార్థుల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారని తెలిపింది. అమెరికాలోని ప్రవాస భారత సమాజంతో సంబంధాలను పెంచుకునే దిశగా పలు సూచనలు చేసినట్లు వివరించింది. అట్లాంటా, షికాగో, హ్యూస్టన్‌, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌లలోని కాన్సుల్‌ జనరళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపింది. ఇటీవల భారతీయ విద్యార్థులు మరణాలపైనా చర్చ జరిగినట్లు వెల్లడించింది.


బీబీసీ ఛైర్మన్‌గా సమీర్‌ షా.. నియామకానికి బ్రిటన్‌ రాజు ఆమోదం

లండన్‌: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఛైర్మన్‌ పదవికి మొట్టమొదటి సారిగా భారత సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. కీలకమైన ఆ పదవిలో డాక్టర్‌ సమీర్‌ షా నియామకానికి బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 ఆమోదం తెలిపారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.


కేజ్రీవాల్‌కు ఏడోసారి ఈడీ సమన్లు

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఏడోసారి నోటీసులు అందించింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని