సీయూఈటీ స్కోర్ల సాధారణీకరణను తొలగించే అవకాశం

ఈ ఏడాది కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్టు (సీయూఈటీ) కోసం సాధారణీకరణ స్కోర్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు యూజీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Published : 23 Feb 2024 04:29 IST

దిల్లీ: ఈ ఏడాది కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్టు (సీయూఈటీ) కోసం సాధారణీకరణ స్కోర్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు యూజీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తమ మూడో ఎడిషన్‌ కోసం పరీక్షను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హైబ్రిడ్‌ పద్ధతిలో ఒకే నెలలో పరీక్షను నిర్వహించడానికి ఏజెన్సీ సన్నద్ధమవుతోందని తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన పట్టణాల్లో పరీక్షను రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్షను నిర్వహించడానికి ఎన్‌టీఏ పని చేస్తుందని, దీనికి కోసం పెద్ద ఎత్తున పాఠశాలలను, కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. గత రెండేళ్లలో హైబ్రిడ్‌ పద్ధతిలో చేతిరాత, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నిర్వహించామని, ఒక పరీక్షను ఒకే రోజు నిర్వహించడంతో స్కోర్ల సాధారణీకరణ ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని పరీక్ష కేంద్రాల్లో ఒకేసారి పరీక్షను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రీజియన్‌ పద్ధతితో ఈ ఏడాది ఒక విద్యార్థి పది పేపర్లకుగానూ కనీసం 6 పేపర్లకు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. నాలుగు డొమైన్‌ పేపర్లు, ఒక భాష పేపర్‌, ఒక సాధారణ పేపర్‌, లేదంటే మూడు డొమైన్‌ పేపర్లు, రెండు భాష పేపర్లు, ఒక సాధారణ పేపరు రాసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని