‘దిల్లీ చలో’పై 29న నిర్ణయం

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ నెల 29 వరకు హరియాణా, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు.

Published : 24 Feb 2024 03:36 IST

రైతు సంఘాల ప్రకటన
గుండెపోటుతో మరో రైతు మృతి

దిల్లీ: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ నెల 29 వరకు హరియాణా, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు... సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) ప్రకటించాయి. ‘‘దిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటాం. ఆ లోపు 24న కొవ్వొత్తుల ర్యాలీ, 26న కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తాం’’ అని కేఎంఎం నేత శర్వాణ్‌ సింగ్‌ పంధేర్‌ తెలిపారు. దేశ రాజధానివైపు వైపు కదం తొక్కుతున్న రైతులను గత 11 రోజులుగా భద్రతా బలగాలు.. హరియాణా, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల దగ్గర నిలువరించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్‌ సింగ్‌ మృతి చెందడంతో ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్‌ మృతికి నిరసనగా బ్లాక్‌ డే నిర్వహించాయి. ఖనౌరీ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై హరియాణా పోలీసులు అడ్డగించారు. వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మరోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్‌ పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌ఏ వెనక్కి

రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హరియాణా ప్రభుత్వం కాస్త మెత్తబడింది. వారికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. హరియాణా సీఎం ఖట్టర్‌.. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో పంటరుణాలపై వడ్డీని మాఫీ చేశారు. కొన్ని పంట రుణాలపై జరిమానా కూడా రద్దు చేశారు.

కేసు నమోదు చేస్తేనే అంత్యక్రియలు

రైతు శుభ్‌కరణ్‌ సింగ్‌ కుటుంబానికి శుక్రవారం పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ రూ.కోటి ప్రకటించారు. అయినా రైతు నేతలు శాంతించలేదు. మృతికి కారణమైన హరియాణా పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

నిరసనలో పాల్గొంటున్న దర్శన్‌ సింగ్‌(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని