మనోహర్‌ జోషీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి (86) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరారు.

Published : 24 Feb 2024 03:37 IST

ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన లోక్‌సభ మాజీ స్పీకర్‌
ముంబయి

లోక్‌సభ మాజీ స్పీకర్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి (86) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1937 డిసెంబర్‌ 2న రాయ్‌గఢ్‌ జిల్లాలోని నందవీ గ్రామంలో జోషి జన్మించారు. ముంబయిలోని వీరమాత జిజాబాయ్‌ టెక్నలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీజేటీఐ) నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేశారు. వాస్తవానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అయితే బాల్‌ ఠాక్రే ‘సన్స్‌ ఆఫ్‌ ది సాయిల్‌’ ప్రచారంలో భాగంగా చేసిన విజ్ఞప్తికి ఆకర్షితుడై.. శివసేన పార్టీలో చేరారు. ‘జోషీ సర్‌’గా ప్రసిద్ధి చెందిన ఆయన అవిభాజ్య శివసేన పార్టీ తరఫున 1995 నుంచి 1999 మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2002-2004 మధ్య కాలంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.  సతీమణి అనఘ మనోహర్‌ జోషి 2020లో మరణించారు. బాలా సాహేబ్‌ ఠాక్రేకు మనోహర్‌ జోషి నమ్మిన బంటులా ఉండేవారు. రాజ్‌ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించి బయటకు వచ్చేసిన సమయంలో చాలా మంది శివసేన నేతల కుమారులు ఆయన వెంట నడవగా, పార్టీ సీనియర్లు మాత్రం బాల్‌ ఠాక్రేతోనే ఉన్నారు. అలా ఉన్న సీనియర్లలో మనోహర్‌ జోషి ఒకరు.

ఉపాధ్యాయుడి నుంచి సీఎం వరకు

తొలినాళ్లలో మనోహర్‌ జోషి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య కాలంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. స్టాండింగ్‌ కమిటీ (మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 1976-77 మధ్య ముంబయి మేయర్‌గా పనిచేశారు. అప్పుడే ‘క్లీన్‌ ముంబయి- గ్రీన్‌ ముంబయి’ ప్రచారాన్ని నడిపారు. 1972లో తొలిసారిగా మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబయి ఉత్తర-మధ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా మనోహర్‌ జోషి విజయం సాధించారు. మనోహర్‌ జోషి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని