ఆర్థిక స్థోమత లేని ఖైదీల విడుదలకు ప్రామాణిక నిబంధనలు పాటించాలి

పూచీకత్తులు, జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న విచారణ, ఇతర ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Updated : 24 Feb 2024 04:37 IST

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: పూచీకత్తులు, జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న విచారణ, ఇతర ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలను నిర్దేశించింది. పేద ఖైదీలను ఆదుకొనేందుకు కేంద్ర నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తున్న నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేద ఖైదీల విడుదలకు అవసరమైన మొత్తాన్ని సదరు నోడల్‌ ఏజెన్సీ నుంచి తీసుకొని సంబంధిత కోర్టుకు బదిలీచేయాలని తెలిపింది. ఈ వ్యవహారం పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్‌, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, ఎస్పీ, జైలు సూపరింటెండెంట్‌ /డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా జడ్జి ప్రతినిధి (జైలును పర్యవేక్షించే న్యాయాధికారి)తో ప్రతి జిల్లాకు ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సాధికార కమిటీ ప్రతి కేసుకు బెయిల్‌ పూచీకత్తు, జరిమానా చెల్లించడానికి ఎంత అవుతుందో లెక్కించాలని, దాని ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆ మొత్తాన్ని సెంట్రల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతా నుంచి డ్రా చేయాలని పేర్కొంది.

అలాగే రాష్ట్రస్థాయిలో హోం /జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ/ఐజీ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్లతో ఒక పర్యవేక్షక కమిటీ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని పరిమితులకు మించిన అంశాలకు ఈ కమిటీ ఆమోదముద్ర వేయాలని స్పష్టంచేసింది.

విచారణ ఖైదీల విడుదలకు అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలు

  • బెయిల్‌ వచ్చిన ఏడు రోజుల్లోపు విచారణ ఖైదీలు జైలు నుంచి విడుదల కాకపోతే జైలు అధికారులు ఆ విషయాన్ని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శికి చెప్పాలి.
  • బెయిల్‌ పొందిన సదరు విచారణ ఖైదీకి పూచీకత్తులు సమర్పించేంత ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అన్న విషయాన్ని సదరు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి విచారించాలి. ఇందుకోసం సదరు కార్యదర్శి పౌరసమాజ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవచ్చు. ఈ మొత్తం కసరత్తును పది రోజుల్లోపు పూర్తిచేయాలి.
  • ప్రతి 2-3 వారాలకోసారి ఇలాంటి కేసుల వివరాలను డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జిల్లా స్థాయి సాధికార కమిటీ ముందు ఉంచాలి.
  • సదరు కమిటీ ఇలాంటి కేసులను పరిశీలించిన తర్వాత పేద ఖైదీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూచీకత్తులు సమర్పించలేకపోతున్నారని భావిస్తే ‘సపోర్ట్‌ టు పూర్‌ ప్రిజనర్స్‌ స్కీం’ కింద వారికి ఆర్థిక ప్రయోజనాల కోసం సిఫార్సు చేయొచ్చు. అలాంటి సమయంలో ఒక్కో ఖైదీకి రూ.40వేల వరకు సాయం చేయొచ్చు. ఈ మొత్తాన్ని డ్రా చేసి కోర్టుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలోనో, వేరే విధానం ప్రకారమో అందజేయొచ్చు.
  • అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ చట్టం, ఎన్‌డీపీఎస్‌, యూఏపీఏ కేసుల్లో అరెస్ట్‌ అయిన వారికి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయకూడదు.
  • బెయిల్‌ పూచీకత్తు కింద చెల్లించాల్సిన మొత్తం రూ.40వేల కంటే ఎక్కువ ఉంటే డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి తన విచక్షణను ఉపయోగించి ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని సాధికార కమిటీకి సిఫార్సు చేయొచ్చు. లేదంటే ఆ పూచీకత్తు మొత్తాన్ని తగ్గించమని లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించవచ్చు. అయితే రూ.40వేలకు మించిన మొత్తం చెల్లింపు ప్రతిపాదనకు రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీ ఆమోదముద్ర వేయాలి.

శిక్ష పడ్డ ఖైదీల విషయంలో...

  • శిక్ష పడ్డ ఖైదీలు జరిమానా చెల్లించలేని కారణంగా జైలు నుంచి విడుదలకాలేకపోతే సదరు జైలు సూపరింటెండెంట్‌ ఏడు రోజుల్లోపు ఆ విషయాన్ని జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శికి తెలపాలి.
  • ఆ ఖైదీ ఆర్థిక పరిస్థితులపై సదరు కార్యదర్శి ఏడు రోజుల్లోపు జిల్లా సామాజిక కార్యకర్త, ఎన్‌జీవో, రెవెన్యూ అధికారుల్లో ఎవరో ఒకరితో విచారించుకోవాలి.
  • ఆ తర్వాత సదరు ఖైదీ విడుదల కోసం జిల్లా సాధికార కమిటీ రూ.25వేలు మంజూరు చేయాలి. ఒకవేళ చెల్లించాల్సిన జరిమానా రూ.25వేలకు మించి ఉంటే సదరు ప్రతిపాదనను రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీ ఆమోదించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని