చైనా హ్యాకర్ల చేతికి భారత ఇమిగ్రేషన్‌ డేటా

చైనాకు చెందిన హ్యాకింగ్‌ ముఠాలు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై భారీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Updated : 24 Feb 2024 04:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన హ్యాకింగ్‌ ముఠాలు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై భారీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ సంచలన కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్‌ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు సదరు కథనం వెల్లడించింది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు భారీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని వారు ఈ దాడులు చేసినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ‘ఐసూన్‌’ అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. గతవారం అవి గిట్‌హబ్‌లో వెలుగుచూశాయి.

చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్‌ పార్టీ హ్యాకింగ్‌ సేవలు అందిస్తోంది. సైబర్‌ దాడులు చేసి విదేశీ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లతో చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌, బ్రిటన్‌, తైవాన్‌, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. ఈ పత్రాలు ఎలా లీక్‌ అయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ‘ఐసూన్‌ హ్యాకర్లు విదేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను తస్కరించినట్లు ఆ పత్రాల్లో ఉంది. భారత్‌ నుంచి 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్‌ డేటాను సేకరించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్‌ నుంచి 3 టెరాబైట్ల కాల్‌ లాగ్స్‌ సమాచారాన్ని దొంగిలించారు’ అని ఆ కథనం వెల్లడించింది. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని