ఆ పిల్లలకు చట్టబద్ధత కల్పించే చట్టాలేంటి?

వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏమిటన్నది సుప్రీంకోర్టు శుక్రవారం తెలుసుకోగోరింది.

Published : 24 Feb 2024 04:44 IST

వివాహ బంధానికి వెలుపల జన్మించిన సంతానంపై ‘సుప్రీం’ ప్రశ్న

దిల్లీ: వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏమిటన్నది సుప్రీంకోర్టు శుక్రవారం తెలుసుకోగోరింది. అద్దె గర్భం (సరోగసీ) నిబంధనలు-2022, అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టం-2021లోని పలు అంశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్న సంధించింది. సరోగసీ నిబంధనల కింద ప్రయోజనం పొందడానికి వివాహ బంధం ద్వారా గర్భధారణకు ప్రయత్నించాలంది. ‘‘వివాహ బంధం ద్వారా గర్భం ధరించాక పుట్టే సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా పేర్కొంటారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 16 ప్రకారం చూసినా.. చెల్లుబాటుకాని పెళ్లి అయినా జరిగి ఉండాలి. అప్పుడే ఆ సంతానానికి చట్టబద్ధత వస్తుంది. పిల్లలకు చట్టబద్ధత కల్పించే చట్టాలు ఇంకేమైనా ఉన్నాయా.. ఎవరైనా దీనిపై స్పష్టత ఇవ్వండి’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి, సరోగసీ నిబంధనలను సవాల్‌ చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.

అయితే, చట్టవిరుద్ధ సంతానమనే భావనే లేదని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో అది తొలగిపోయిందని ఐశ్వర్య పేర్కొన్నారు. ఈ అంశంపై ఒక అభిప్రాయానికి వచ్చేలా కోర్టుకు తాము సహకరిస్తామని చెప్పారు. సరోగసీ అనేది సంతానం పొందడానికి చిట్టచివరి అవకాశమని పేర్కొన్నారు. జీవిత భాగస్వాముల్లో ఎవరో ఒకరికి వైద్యపరమైన ఇబ్బందులు ఉన్న సందర్భాల్లో దాత నుంచి అండం లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేలా సరోగసి నిబంధనలు-2022కు మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 21న నోటిఫికేషన్‌ జారీచేసిన నేపథ్యంలో ధర్మాసనం అనేక పిటిషన్లను పరిష్కరించింది. అయితే అవివాహిత మహిళలు సరోగసీ చట్టం కింద ప్రయోజనం పొందే అంశంపై దాఖలైన పిటిషన్లను పరిష్కరించడంలేదని ధర్మాసనం తెలిపింది. దీనిపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఐశ్వర్యకు సూచించింది.


‘కాందీశీకుల ఆస్తులకు కేంద్రం యజమాని కాదు’

మన దేశంలో కాందీశీకులు వదిలిపెట్టి వెళ్లిన ఆస్తులకు కేంద్ర ప్రభుత్వం యజమాని కాదని, సంరక్షణ అధికారాలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. అటువంటి ఆస్తుల యాజమాన్యాన్ని ఇతరులకు బదిలీ చేయజాలదని పేర్కొంది. ఇంటి పన్ను, నీటి పన్ను, మున్సిపల్‌ సెస్‌ తదితరాలను చెల్లించకుండా మినహాయింపు కోరలేదని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కాందీశీకుల ఆస్తులను తమ అధీనంలో ఉంచుకున్న వ్యక్తుల నుంచి పన్ను వసూళ్లను నిలిపివేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును లఖ్‌నవూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

కాందీశీకులు వదిలి వెళ్లిన ఆస్తిలోని కొంత భాగంలో ‘కొహ్లీ బ్రదర్స్‌ కలర్‌ ల్యాబ్‌’... వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంటి, నీటి పన్ను వసూళ్ల కోసం నోటీసులివ్వగా ఆ వ్యాపార సంస్థ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాందీశీకుల ఆస్తిని తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ దానికి యజమాని కాలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి స్వాధీన హక్కు కేంద్రానికి గానీ, కేంద్రం నియమించిన ధర్మకర్తకు కానీ సంక్రమించబోదని పేర్కొంది. ఆ ఆస్తికి పన్నుల నుంచి మినహాయింపు కోరే హక్కు కేంద్రానికి కూడా లేదని తెలిపింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని