అటవీకరణతో కొన్ని దుష్ప్రభావాలు!

అటవీకరణ వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తాం. కానీ భారీస్థాయిలో అడవులు పెంచడం వల్ల కొన్ని దుష్ప్రభావాలూ ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.

Published : 24 Feb 2024 04:07 IST

దిల్లీ: అటవీకరణ వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తాం. కానీ భారీస్థాయిలో అడవులు పెంచడం వల్ల కొన్ని దుష్ప్రభావాలూ ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. బంజరు భూములు, సాగు భూములలో పెంచే అడవులు వాతావరణం నుంచి అధికంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకునే మాట నిజమే కానీ, భూగోళంపై ఇతర అంశాలు అటవీకరణ ప్రయోజనాలను మూడో వంతు మేర తగ్గిస్తాయని వారు వెల్లడించారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం, ప్రపంచ వన్యజీవ సంరక్షణ సంస్థ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌) జరిపిన ఉమ్మడి అధ్యయనం ఈ సంగతి వెల్లడించింది. అడవుల వల్ల సూర్యకాంతి తక్కువగా పరావర్తనం చెందుతుంది. భూ వాతావరణంలో మీథేన్‌, ఓజోన్‌ వంటి ఇతర కర్బన ఉద్గారాల పాళ్లలో మార్పు వస్తుంది. దీంతో అటవీకరణ ప్రయోజనాలు మూడో వంతు మేర తగ్గిపోతాయి. వాతావరణ మార్పుల నిరోధానికి శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ, అటవీకరణ చేపడితేనే ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా పరిశోధకులు పేర్కొన్నారు.  కొత్త అడవులను పెంచడంకన్నా ఉన్న అడవులను రక్షించడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు లభిసాయని తెలిపారు. ఉష్ణమండలంలో అడవులు పెంచడం వాతావరణ మార్పుల నిరోధానికి ఎక్కువ ఉపకరిస్తుందని, శీతల, సమశీతోష్ణ మండలాల్లో అడవుల పెంపకం భూతాపం పెరగడానికి దారితీయవచ్చునని అధ్యయనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని