సందేశ్‌ఖాలీలో ఆగని నిరసనలు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. మహిళలను వేధింపులకు గురిచేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నాయకులను అరెస్టు చేయకపోవడంపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.

Published : 24 Feb 2024 04:09 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. మహిళలను వేధింపులకు గురిచేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నాయకులను అరెస్టు చేయకపోవడంపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. జుప్‌ఖాలీ ప్రాంతంలో దుంగలకు నిప్పంటించి పోలీసు వాహనాలు ప్రవేశించకుండా అడ్డగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీజీపీ రాజీవ్‌ కుమార్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్థుల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూమిని వారికి తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఆరుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సందేశ్‌ఖాలీలో పర్యటించి బాధితులతో మాట్లాడింది. అక్కడ జరిగిన హింసపై తమకు నాలుగు వారాలలోపు పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. మరోవైపు ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటించేందుకు యత్నించిన భాజపా మహిళ విభాగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన భాజపా జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేయకపోవడంపై మండిపడ్డారు. మార్చి 1,2,6 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారని భాజపా వర్గాలు తెలిపాయి.


షాజహాన్‌ షేక్‌తో సంబంధాలు.. 5 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేత షాజహాన్‌ షేక్‌తో సంబంధాలున్న వ్యాపారవేత్తల నివాసాల్లో ఈడీ దాడులు చేసింది. రాష్ట్రంలోని హావ్‌డా, బిజోయ్‌గఢ్‌, బిరాటీ సహా అయిదు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. కేంద్ర బలగాలతో కలిసి హావ్‌డాలోని పార్థిమాన్‌ అనే చేపల వ్యాపారి, బిరాటీలోని అరుణ్‌ సేన్‌గుప్తా, అరుణ్‌ శోమ్‌ ప్రాంగణాల్లో దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా రూ.కోట్ల రేషన్‌ బియ్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్‌ షేక్‌కు తాజాగా దర్యాప్తు సంస్థ నాలుగో సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని