భారతీయ న్యాయ సంహిత కొత్త కేసులకే!

జులై 1 నుంచి అమల్లోకి రానున్న మూడు నేర న్యాయ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్లు, శిక్షలు జులై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి.

Published : 25 Feb 2024 05:11 IST

నాగరిక్‌ సురక్ష సంహిత పాత కేసులకూ వర్తించొచ్చు: న్యాయ నిపుణులు

ఈనాడు, దిల్లీ: జులై 1 నుంచి అమల్లోకి రానున్న మూడు నేర న్యాయ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్లు, శిక్షలు జులై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి. సీఆర్‌పీసీ స్థానంలో రానున్న భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) పరిధిలోకి మాత్రం పాతకేసులూ వచ్చే అవకాశం ఉంది. కేసుల విచారణ విధానం గురించి బీఎన్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది కాబట్టి దీన్ని పాత తేదీలనుంచి వర్తింపచేయొచ్చన్నది కొందరు న్యాయనిపుణుల అభిప్రాయం. ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో వస్తున్న భారతీయ సాక్ష్య అధినియమ్‌ అమలులో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులోని ప్రొసీజరల్‌ నిబంధనలు పాత కేసులకూ వర్తిస్తాయని, సబ్‌స్టాన్షియల్‌ నిబంధనలు మాత్రం కొత్త కేసులకే అమలవ్వొచ్చని చెబుతున్నారు. ఒక నేరానికి రెండురకాల శిక్షలు ఉంటే అందులో తక్కువ శిక్షను నేరస్థులకు విధించాలన్నది న్యాయ సూత్రమని, అందువల్ల కొత్త ఐపీసీ చట్టంలో ఏవైనా నేరాలకు పాత చట్టంలో కంటే బీఎన్‌ఎస్‌లో తక్కువ శిక్ష ఉంటే కొత్త చట్టం ప్రకారమే శిక్ష విధించమని నేరస్థులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకొనే అవకాశమూ ఉందని కొందరు న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరికొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఐపీసీ పూర్తిగా రద్దయిపోయి, కొత్త చట్టం అమల్లోకి వస్తున్నందున ఒక నేరానికి ఒకే శిక్ష అమల్లో ఉంటుందని, అందువల్ల తక్కువ శిక్ష విధించమని అడగడానికి వీలుండదన్నది వారి వాదన. నేరం జరిగిన రోజు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష ఉంటుందని అంటున్నారు. ప్రొసీజరల్‌ విషయాలకు మాత్రమే పాతకేసులకూ కొత్త చట్టం వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు సమయంలో చాలా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని, వాటిపై స్పష్టతకోసం భవిష్యత్తులో కోర్టుల్లో పెద్దసంఖ్యలో కేసులు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని