ప్రతిసారీ విశ్వసనీయ సమాధానాన్ని ఇవ్వకపోవచ్చు

ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గూగుల్‌ శనివారం స్పందించింది.

Published : 25 Feb 2024 05:11 IST

మోదీపై ‘జెమినీ’ వివాదాస్పద సమాధానంపై గూగుల్‌ స్పందన

దిల్లీ: ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గూగుల్‌ శనివారం స్పందించింది. సమకాలీన, రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్‌బాట్‌ అన్నిసార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపింది. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్‌ అడగ్గా.. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో గూగుల్‌ పక్షపాతంగా పనిచేస్తోందంటూ నెట్టింట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్‌ కోడ్‌ నిబంధనల ఉల్లంఘనే అని, దీనిపై చర్యలు తప్పవంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో గూగుల్‌ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం త్వరితగతిన చర్యలు చేపట్టాం. ‘జెమిని’ని మేం ఓ సృజనాత్మక టూల్‌గా అభివృద్ధి చేశాం. అయితే, సమకాలీన, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు ఈ టూల్‌ ప్రతిసారీ విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చు. ఈ విషయంలో మా ఏఐను మరింత కచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేసేందుకు మేం నిరంతరం శ్రమిస్తున్నాం’’ అని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని