‘మీ ఇంట్లో గొడవైతే.. నన్ను అనొద్దు!’

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించి, నూతనంగా నిర్మించిన అమూల్‌ బనస్‌ డెయిరీ ప్లాంటును ప్రారంభించి, స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న కొంతమంది మహిళలతో ముచ్చటించారు.

Published : 25 Feb 2024 05:14 IST

ప్రధాని మోదీ సరదా వ్యాఖ్య

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించి, నూతనంగా నిర్మించిన అమూల్‌ బనస్‌ డెయిరీ ప్లాంటును ప్రారంభించి, స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న కొంతమంది మహిళలతో ముచ్చటించారు. వారితో సరదాగా మాట్లాడారు. ‘‘గిర్‌ ఆవుల పెంపకంతో మా కుటుంబ ఆదాయం పెరిగింది. మేం స్వావలంబన సాధించాం. ఈ ఆవులు మా కుటుంబంలో భాగమయ్యాయి’’ అని మహిళలు సంతోషంగా చెప్పారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘‘పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మహిళల ఖాతాలోనే జమ చేయాలనేది మా ఆలోచన. మీకు ఇప్పుడు ఆదాయం వస్తోంది కదా.. ఇంట్లో మీరు దాదాగిరి చేస్తున్నారా? దీనివల్ల మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మాత్రం.. మోదీ వల్లే అని అనకూడదు’’ అంటూ చమత్కరించారు. ఆవులతో సెల్ఫీ తీసుకున్నారా? అని మోదీ అడగ్గా ఆ పని ఎప్పుడో చేశామంటూ మహిళలు బదులిచ్చారు. ఆ దృశ్యాలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

జామ్‌నగర్‌లో మోదీ రోడ్‌షో

ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. స్థానిక విమానాశ్రయం నుంచి సర్క్యూట్‌హౌస్‌ వరకు నిర్వహించిన రోడ్‌షోలో .. ప్రజలు పెద్దఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరి.. ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రధాని తన వాహనం పైనుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆదివారం ఆయన రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని