రాజ్యాంగం సవివర పరిష్కార సూచిక కాదు

అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు.

Updated : 25 Feb 2024 06:43 IST

అదో మార్గదర్శక నమూనా మాత్రమే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యలు

ఢాకా: అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు. శనివారం ఆయన బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో రెండు రోజుల న్యాయ సదస్సు ముగింపు సమావేశంలో భాగంగా ‘దక్షిణాసియాలో వలస పాలన అనంతర రాజ్యాంగ పరిణామాలు’ అనే అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగమనేది అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి సవివర పరిష్కార సూచిక కాదనీ, అది ఒక మార్గదర్శక నమూనాగానే పనిచేస్తుందని స్పష్టంచేశారు. అసలు సిసలు అధికార ప్రదాతలైన ప్రజల వద్దకు రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వాలను, దుర్విచక్షణ రహిత సమాజాన్నీ, చట్టబద్ధ ప్రక్రియలను ప్రజలకు అందించగలిగితే న్యాయస్థానాలు తమ బాధ్యతను నెరవేర్చినట్లేనని స్పష్టంచేశారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ న్యాయవ్యవస్థలు ఇంటర్నెట్‌ సృష్టించిన డిజిటల్‌ అఖాతాన్ని అధిగమించడానికి, ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. టెక్నాలజీ అనేది ఉన్నత వర్గాలకే పరిమితం కారాదనీ, అది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. భారత న్యాయవ్యవస్థకు ఒక టెక్నాలజీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. భారత్‌లో.. జాతీయ న్యాయ సమాచార నిధిని ఏర్పాటు చేశామని, దేశంలోని ప్రతి కేసు వివరాలు అందులో నిక్షిప్తమవుతాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. సుప్రీంకోర్టు నివేదికల డిజిటల్‌ ప్రతులు భారత పౌరులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కూడా కోర్టు సేవలను పొందడానికి వీలుగా అన్ని కోర్టులలో ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా కూడా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని