డిమాండ్లు తీరేవరకు ఉద్యమం ముగియదు

తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని రైతుల నేత సర్వన్‌సింగ్‌ పంధేర్‌ స్పష్టం చేశారు.

Published : 25 Feb 2024 05:23 IST

రైతుల నేత పంధేర్‌ స్పష్టీకరణ

చండీగఢ్‌: తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని రైతుల నేత సర్వన్‌సింగ్‌ పంధేర్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి తామేమీ కలవరం చెందడం లేదని, అది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆందోళన కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ సహా వివిధ అంశాలపై ఉద్యమిస్తున్న రైతులు ‘దిల్లీ చలో’ పేరిట బయల్దేరి, భద్రత బలగాలు అడ్డగించడంతో పంజాబ్‌-హరియాణా సరిహద్దు వద్ద మకాం వేసిన విషయం తెలిసిందే. శంభు సరిహద్దు వద్ద పంధేర్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదిస్తే ఉద్యమంపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రోహ్‌తక్‌లో గాయపడిన పంజాబ్‌ రైతును తమకు అప్పగించాలని హరియాణా ప్రభుత్వాన్ని కోరిన మీదట శనివారం ఆయన్ని చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆసుపత్రికి తరించినట్లు పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ తెలిపారు. మొబైల్‌ ఇంటర్నెట్‌, గంపగుత్త ఎస్‌ఎంఎస్‌లపై విధించిన నిషేధాన్ని మొత్తం ఏడు జిల్లాలకు వర్తింపజేస్తున్నారు.

పాక్షికంగా వాహనాలకు అనుమతి

రైతుల ఉద్యమంతో మూసివేసిన సింఘు, టిక్రి సరిహద్దుల రహదారుల్లో ఒక్కో వరస సర్వీస్‌ రోడ్డులో వాహనాలను శనివారం నుంచి అనుమతిస్తున్నారు. దాదాపు రెండువారాలుగా వీటిని మూసివేసి ఉంచారు. పాక్షిక సడలింపుతో దిల్లీ నుంచి హరియాణా వెళ్లడానికి కొంత ఉపశమనం లభించనుంది. పరిస్థితిని సమీక్షిస్తూ.. అవసరమైతే మళ్లీ వీటిని మూసివేస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని