కొత్త నేర న్యాయ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి

బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌) జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

Updated : 25 Feb 2024 06:46 IST

కేంద్ర హోంశాఖ ప్రకటన
106(2) సెక్షన్‌కు మాత్రం మినహాయింపు

ఈనాడు, దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌) జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్లు వెలువరించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 106(2) అమలుకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ సెక్షన్‌ ప్రకారం.. వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యేవారికి గరిష్ఠంగా 10 ఏళ్లవరకు శిక్ష విధించొచ్చు. దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్‌ డ్రైవర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో హోంశాఖ పేర్కొంది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను తొలుత గత ఏడాది ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత పార్లమెంటరీ స్థాయీసంఘం పరిశీలనకు పంపింది. స్థాయీసంఘం నివేదిక అనంతరం డిసెంబర్‌ 20న లోక్‌సభ, 21న రాజ్యసభ వీటిని ఆమోదించాయి.

అదే నెల 25న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతి తెలపడంతో చట్టరూపం సంతరించుకున్నాయి. ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే.. బ్రిటిష్‌ వలస పాలన కాలం నుంచీ అమల్లో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ). భారతీయ సాక్ష్యాధార చట్టం (1872) రద్దవుతాయి. ఈ మూడు బిల్లులపై పార్లమెంటులో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానమిస్తూ,  బిల్లుల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చామని, రాజద్రోహం వంటి పదాలను తొలగించామని వివరించారు. అయితే భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. దేశద్రోహానికి పాల్పడితే.. గరిష్ఠ శిక్ష యావజ్జీవ కారాగారం, కనిష్ఠ శిక్ష ఏడేళ్ల జైలు. ఐపీసీలోనైతే రాజద్రోహానికి సెక్షన్‌ 127ఎ ప్రకారం.. గరిష్ఠ శిక్ష యావజ్జీవం. కనిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని