సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గుజరాత్‌ తీరంలో అరేబియా సముద్రంలో మరో సాహసకృత్యం చేశారు. నౌకాదళ డైవర్ల సాయంతో స్కూబా డైవింగ్‌ చేసుకుంటూ సముద్ర గర్భానికి చేరుకున్నారు.

Published : 26 Feb 2024 05:04 IST

ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డైవింగ్‌
దైవానికి కానుకగా నెమలి పింఛాలు
దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభం

దేవభూమి ద్వారక: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గుజరాత్‌ తీరంలో అరేబియా సముద్రంలో మరో సాహసకృత్యం చేశారు. నౌకాదళ డైవర్ల సాయంతో స్కూబా డైవింగ్‌ చేసుకుంటూ సముద్ర గర్భానికి చేరుకున్నారు. బెట్‌ ద్వారకా ద్వీపం వద్ద నీళ్లలోఉన్న ప్రాచీన ద్వారక నగరాన్ని చూసి తన్మయులయ్యారు. పద్మాసనం వేసి, తన వెంట తెచ్చుకున్న నెమలి పింఛాలను శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించారు. అక్కడే పూజలు చేసి, సముద్ర  ఉపరితలం మీదకి తిరిగొచ్చారు. చారిత్రక ఆధారాలున్న ద్వారక నగరాన్ని చేరుకుని దైవాన్ని ప్రార్థించడం దివ్యమైన అనుభూతిని ఇచ్చిందని, ఈ ప్రయాణాన్ని సాహసయాత్రగా కంటే విశ్వాసంతో చేసినదిగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల లక్షద్వీప్‌ పర్యటనలో సాహసంతో స్విమ్మింగ్‌, స్నార్కెలింగ్‌ చేసిన ప్రధాని తన తాజా యాత్ర చిత్రాలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

దశాబ్దాల కల నెరవేరిన క్షణాలివి

‘‘ఆధ్యాత్మిక వైభవం, అనంతమైన భక్తితో కూడిన పురాతన యుగానికి కాసేపు అనుసంధానమయ్యాను. శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. సముద్రగర్భ ద్వారకను చేరుకోవాలనేది నాకు దశాబ్దాల కల. ఎట్టకేలకు అది నెరవేరినప్పుడు, పవిత్ర భూమిని చేతులతో తాకినప్పుడు నా మది అంతా భావోద్వేగంతో నిండిపోయింది. అక్కడకు వెళ్లగానే దేశ వైభవమంతా కళ్లముందు కదలాడింది. వేదాల్లోనూ ఈ నగరం గురించి ఉంది. ఒక గొప్ప నగరానికి ప్రణాళిక, అభివృద్ధి ఎలా ఉండాలో చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఈ నిర్మాణ దార్శనికత చూశాక దేశాభివృద్ధికి నా సంకల్పం మరింత బలపడింది. శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించారని చెబుతారు’’ అని మోదీ వివరించారు.

అందుబాటులోకి సుదర్శన్‌ సేతు

దేశంలో అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్‌ సేతు’ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని.. బెట్‌ ద్వారక ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని ప్రారంభించారు. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ వంతెనపై 2.50 మీటర్ల వెడల్పైన నడకమార్గం కూడా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంతవరకు నాటుపడవలే ఆధారంగా ఉండేవి. కొత్త వంతెనపై పలుచోట్ల సౌరఫలకాలు ఏర్పాటుచేసి ఒక మెగావాట్‌ విద్యుదుత్పత్తి చేయనున్నారు. మొత్తం రూ.4,100 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పూర్తి బలాన్ని ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడానికే వినియోగించిందని విమర్శించారు. అన్ని కుంభకోణాలూ ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పారు. వాటన్నిటికీ తమ సర్కారు అడ్డుకట్ట వేసిందన్నారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించారు. రాజ్‌కోట్‌లో నిర్మించిన ఎయిమ్స్‌ను ఆయన ప్రారంభించారు. మరో 4 రాష్ట్రాల్లో వాటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇతరుల నుంచి ఆశలు అంతరించినప్పుడు మోదీ హామీ మొదలవుతుందని చెప్పారు. 50 ఏళ్లపాటు దేశానికి ఒకే ఎయిమ్స్‌ సంస్థ దిల్లీలో ఉంటే పది రోజుల్లోనే తాను ఏడు ఎయిమ్స్‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశానని, వీటిలో రాయ్‌బరేలీ కూడా ఉందని వివరించారు. ఆరేడు దశాబ్దాల్లో లేని అభివృద్ధిని సాధించి ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని