కేరళలో ఘనంగా రోడ్డుకు పెళ్లి!

రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడ్‌లోని కొడియాత్తూరు గ్రామస్థులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు.

Published : 27 Feb 2024 05:37 IST

రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడ్‌లోని కొడియాత్తూరు గ్రామస్థులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు? వరుడు రోడ్డు ఎవరు? అని అడిగేరు సుమా! ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే ‘రోడ్డుకు పెళ్లి’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కొడియాత్తూరులో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది. దీనిని 1980ల్లో నిర్మించారు. అనంతరం ఆ గ్రామ జనాభా 3 రెట్లు పెరిగింది. వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినా కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు. వారికి పరిహారం, రహదారి నిర్మాణానికి రూ.60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామానికి చెందిన 15 మంది ముందుకొచ్చి ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున రూ.15 లక్షల విరాళం అందించారు. ఇంకా వారికి రూ.45 లక్షలు అవసరం. అప్పుడే వారికి పనం పయట్టు లేదా కురికల్యాణం గుర్తుకొచ్చింది. ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి.. నిధులు సమీకరిస్తారు.  ఇప్పుడు కొడియాత్తూరు గ్రామస్థులు సైతం నిధుల కోసం ‘పనం పయట్టు’ కింద రహదారికి పెళ్లిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని