ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో నిర్మించిన పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ (పీఐఎఫ్‌) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Published : 28 Feb 2024 05:18 IST

రూ.471 కోట్లతో పీఐఎఫ్‌ నిర్మాణం
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో నిర్మించిన పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ (పీఐఎఫ్‌) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి మంగళవారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు కొత్తగా ప్రయోగ వేదిక నిర్మించకుండా అందుబాటులో ఉన్న మొదటి ప్రయోగ వేదికను పీఐఎఫ్‌గా ఆధునికీకరించేందుకు 2018లో నిర్ణయించారు. ఈ మేరకు 2019లో కేంద్రం నుంచి అనుమతులు రావడంతో రూ.471 కోట్లతో పనులు ప్రారంభించి పూర్తి చేశారు.  

పీఐఎఫ్‌లోనే వాహకనౌక అనుసంధానం 

ఇప్పటి వరకు రాకెట్‌ను ప్రయోగ వేదికపైనే అనుసంధానం చేసేవారు. పీఐఎఫ్‌ అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ఇందులోనే వాహకనౌక అనుసంధానం చేసి పూర్తి సాంకేతిక పరీక్షలు నిర్వహించాక ప్రయోగ వేదికకు తరలిస్తారు. అక్కడ ఉపగ్రహాన్ని అనుసంధానం చేసి, ఉష్ణకవచ అమరిక పూర్తి చేస్తారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పీఐఎఫ్‌ను డిజైన్‌ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 15 అంతస్తులతో ఉండే ఈ భవనం ఎత్తు 66 మీటర్లు. రాకెట్‌ అనుసంధానం కోసం పది ప్లాట్‌ఫామ్‌లు, ద్రవ ఇంధనం నింపేందుకు సర్క్యూట్‌ తదితర అత్యాధునిక సౌకర్యాలను పీఐఎఫ్‌లో ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని