లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఖాన్విల్కర్‌

అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌- లోక్‌పాల్‌కు ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావ్‌ ఖాన్విల్కర్‌ నియమితులయ్యారు.

Published : 28 Feb 2024 05:18 IST

సభ్యులుగా ఆరుగురి నియామకం

ఈనాడు, దిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌- లోక్‌పాల్‌కు ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావ్‌ ఖాన్విల్కర్‌ నియమితులయ్యారు. జుడిషియల్‌ సభ్యులుగా హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లింగప్ప నారాయణస్వామి, అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌యాదవ్‌, ప్రస్తుతం లా కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నియమితులయ్యారు. నాన్‌ జుడిషియల్‌ సభ్యులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ సుశీల్‌చంద్ర, పంకజ్‌కుమార్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ టిర్కీ నియమితులయ్యారు. లోక్‌పాల్‌ తొలి ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ 2019 మార్చి 23 నుంచి 2022 మే 27వరకు ఉన్నారు.

కీలక కేసులలో తీర్పులిచ్చిన అనుభవశీలి

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ 1957 జులై 30న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. 1984లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. తర్వాత బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా; హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి.. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జులై 29న పదవీ విరమణ చేశారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా నేర చరిత్రను వెల్లడించాలని తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయనొకరు. గుజరాత్‌ అల్లర్ల కేసులో ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం గురించి విచారించకుండానే కేసు మూసివేత నివేదికను సిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన కేసును కొట్టివేసిన ధర్మాసనంలో ఒక సభ్యుడిగా ఆయన ఉన్నారు. హోమోసెక్సువల్‌ సంబంధాలు ప్రైవేటుగా ఉండటం చట్టబద్ధమేనని తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. విచారణ జరపడానికి, ఆస్తుల జప్తునకు ఈడీకి అధికారం ఉండటం సమర్థనీయమేనని రూలింగ్‌ ఇచ్చారు. అక్రమ నగదు చలామణితో దేశ సమగ్రతకు ముప్పు అని ఒక కేసు తీర్పులో పేర్కొన్నారు. విదేశీ విరాళాల స్వీకరణ చట్ట సవరణ, ఆధార్‌ విధానం, సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం వంటి కేసుల్లో తీర్పులు వెలువరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 187 తీర్పులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు