కోడ్‌ కూయకముందే సీఏఏ నిబంధనల జారీ!

వివాదాస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)’ అమలు నిబంధనల్ని.. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళికి ముందే కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి.

Published : 28 Feb 2024 03:57 IST

దిల్లీ: వివాదాస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)’ అమలు నిబంధనల్ని.. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళికి ముందే కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే కోడ్‌ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసిందే. మరో రెండు వారాల్లోగానే షెడ్యూలు వెలువడవచ్చని భావిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా నిబంధనల్ని ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఏఏ చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. నిబంధనలు లేకపోవడంతో ఇంతవరకు ఈ చట్టం అమల్లోకి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని