లోకోపైలట్‌, స్టేషన్‌ మాస్టర్ల నిర్లక్ష్యమే కారణం

డ్రైవర్‌ లేకుండా అత్యంత ప్రమాదకరంగా గూడ్స్‌ రైలు ప్రయాణించిన ఘటన లోకోపైలట్‌, స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు రైల్వే ఉన్నతాధికారులు తేల్చారు.

Updated : 28 Feb 2024 05:58 IST

డ్రైవర్‌ లేకుండా రైలు ప్రయాణించిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం

దిల్లీ: డ్రైవర్‌ లేకుండా అత్యంత ప్రమాదకరంగా గూడ్స్‌ రైలు ప్రయాణించిన ఘటన లోకోపైలట్‌, స్టేషన్‌ మాస్టర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు రైల్వే ఉన్నతాధికారులు తేల్చారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన తర్వాత అధికారులు నివేదిక రూపొందించారు.

పొరపాటు జరిగింది అక్కడే

కథువా స్టేషన్‌లో రైలు ఇంజిన్‌తో పాటు 3 వ్యాగన్లను ఆపేందుకు హ్యాండ్‌ బ్రేకులను అప్లై చేశానని, రైలు ముందుకు కదలకుండా ట్రాకులపై రెండు చెక్కదుంగలను కూడా అడ్డుపెట్టానని లోకోపైలట్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఉచ్చిబస్సి స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత తనిఖీ చేసిన అక్కడి స్టేషన్‌మాస్టర్‌.. వ్యాగన్ల హ్యాండ్‌బ్రేకులు వేయలేదని గుర్తించారు. రైల్వే నిబంధనల ప్రకారం బ్రేక్‌లు సరిగ్గా వేశారో లేదో చూడడం,  రైలు ముందుకు కదలకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొనే బాధ్యత స్టేషన్‌ మాస్టర్‌దే.

పట్టాలు వాలుగా ఉండడంతో ముందుకు కదిలిన రైలు

కథువా స్టేషన్‌లో నిలిపిన రైలుకు బ్రేక్‌ వ్యాన్‌(గార్డ్‌ కోచ్‌) లేదు. రైలును స్టేషన్‌ నుంచి జమ్ముకు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పమని స్టేషన్‌ మాస్టర్‌కు కంట్రోల్‌ రూం తెలిపింది. కానీ, రైల్లో గార్డ్‌ కోచ్‌ లేకపోవడంతో లోకోపైలట్‌ దీనికి నిరాకరించాడు. దీంతో చేసేదేం లేక రైలును అక్కడే వదిలి విధుల నుంచి విరామం తీసుకోమని కంట్రోల్‌రూం తెలిపింది. తాళం స్టేషన్‌మాస్టర్‌కు అందించి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. ఉదయం 6 నుంచి 7:10 మధ్య రైల్లో ఎవరూ లేరు. పట్టాలు వాలుగా ఉండడంతో రైలు దానంతట అదే ముందుకు కదిలింది. రైల్వే నిబంధనల ప్రకారం రైల్లో ఎవరూ లేకుండా నిలిపి ఉంచే సమయంలో స్టేషన్‌మాస్టర్‌ లిఖిత పూర్వకంగా లోకోపైలట్‌కు అనుమతి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇక్కడ జరగలేదు. లోకోపైలట్‌ కూడా రిజిస్టర్‌లో సమాచారాన్ని పేర్కొనలేదు. సంతకమూ చేయలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం ఆరుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని