ఉచిత బస్సు సౌకర్యంతో ఆదా!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి.ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది.

Updated : 28 Feb 2024 05:53 IST

నెలకు రూ.400 నుంచి రూ.1,500 వరకు మిగుల్చుకుంటున్న మహిళలు
తమిళనాట సర్వేలో వెల్లడి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు పార్టీలు సైతం ఈ అంశాన్ని మ్యానిఫెస్టోల్లో పెట్టేందుకు పరిశీలిస్తున్నాయి. ఈ పథకంపై తాజాగా తమిళనాడులో సర్వే జరిగింది. ఈ సదుపాయం కారణంగా మహిళలు డబ్బు మిగుల్చుకోవడంతో పాటు వ్యాపారాలు, ఉద్యోగాలు, రోజువారీ పనుల్లో చురుగ్గా ఉంటున్నట్లు సర్వేలో తేలింది.

ఈనాడు, చెన్నై: తమిళనాడులో నిత్యం సగటున 50 లక్షల మంది మహిళలు ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాన్ని హిజ్రాలు, దివ్యాంగులకు, కొండప్రాంతాల వారికీ విస్తరిస్తూ తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి ఇందుకోసం రూ.3,050 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని మహిళలు బాగా వినియోగించుకుంటున్నారని, వారి వ్యాపారాల్లోనూ లాభాలొస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. చెన్నైకి చెందిన సిటిజన్‌ కన్జ్యూమర్‌ అండ్‌ సివిక్‌ యాక్షన్‌ గ్రూప్‌(కాగ్‌) ఈ పథకం అమలుపై సర్వే నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, సేలం, తదితర నగరాల్లో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్న 3వేల మంది మహిళలతో మాట్లాడింది.

డబ్బు ఆదా అవుతోంది

  • మూడింట రెండోవంతు మహిళలు నెలకు కనీసం రూ.400 మిగుల్చుకుంటున్నట్లు సర్వేలో తేలింది. మరో 20 శాతం మంది నెలకు రూ.800, 18 శాతం మంది రూ.800 నుంచి రూ.1000 వరకూ ఆదా చేస్తున్నారు. మరికొందరు రూ.1500 పైనే మిగుల్చుకుంటున్నారు. పథకం రాకముందు తమ ప్రయాణాలకే ఎక్కువ డబ్బు ఖర్చయ్యేదని ఇప్పుడు ఆదాఅవుతోందని వారంటున్నారు.
  • గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరవాసులే ఉచిత బస్సు పథకాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. చెన్నై నగర ప్రయాణికుల్లో గృహిణులు 53.2 శాతం, స్వయం ఉపాధి పొందే వారు 12.4 శాతం, ఉద్యోగులు 10.8 శాతం, విద్యార్థినులు 3.8 శాతం ఉన్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో 90శాతం మంది నెలకు రూ.20 వేలకన్నా తక్కువ జీతం తీసుకునేవారే. ఇప్పుడు రవాణా ఖర్చులు మిగలడంతో ఆ డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నట్లు వివరించారు

బంధువులను కలుస్తున్నారు..

మగవారితో పోల్చితే ఆడవారికే ఎక్కువ ప్రయాణాలు అవసరమవుతున్నాయని సర్వే నివేదికలో పేర్కొన్నారు. పిల్లల్ని బడికి తీసుకెళ్లడం, కాలేజీ, ఉద్యోగం, వ్యాపారాలకెళ్లడంతో రోజుకు పలుమార్లు బస్సుల్లో వేర్వేరు రూట్లలో వెళ్లాల్సి వస్తున్నట్లు మహిళలు తెలిపారు. తక్కువ దూరపు ప్రయాణాలే కావడం, ఆటోలు, ట్యాక్సీల ప్రయాణ ఖర్చులు పెరగడంతో ఇప్పుడీ పథకాన్ని అధికంగా వినియోగించుకుంటున్నట్లుగా మహిళలు తెలిపారు.

నాలుగింట ఒకవంతు మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించి కుటుంబంతో కలిసి ఆలయాల సందర్శన, మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, పార్కులకు, బీచ్‌లకు వెళ్లి సేదతీరుతున్నారు. ఈ పథకం వచ్చాక అంతకు ముందుతో పోల్చితే ఈ తరహా కార్యక్రమాలు బాగా పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది.


బస్సులు పెంచాలి..

ఉచిత ప్రయాణాన్ని ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లోనే అనుమతిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌లకూ వర్తింపచేస్తే మహిళల్లో మరింత మార్పు సాధ్యమని సర్వే వెల్లడించింది.

  • పథకం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సులు పెంచేలా చర్యలు తీసుకోవాలని మహిళలు సూచించారు.
  • రద్దీ పెరగడంతో బస్సుల కోసం వేచి ఉండే సమయం బాగా ఎక్కువగా ఉంటోందని 59 శాతం మంది సర్వేలో తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని