షాజహాన్‌ను ఈడీ, సీబీఐ అరెస్టు చేయవచ్చు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను రాష్ట్ర పోలీసులతో పాటు ఈడీ, సీబీఐ సైతం అరెస్టు చేయొచ్చని కలకత్తా హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది.

Updated : 29 Feb 2024 05:43 IST

కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను రాష్ట్ర పోలీసులతో పాటు ఈడీ, సీబీఐ సైతం అరెస్టు చేయొచ్చని కలకత్తా హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. పరారీలో ఉన్న షాజహాన్‌ను పోలీసులు అరెస్టు చేయవచ్చంటూ హైకోర్టు ఈ నెల 26న అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ మరింత స్పష్టత కోరడంతో ధర్మాసనం స్పందించింది.

పోలీసుల వద్ద సురక్షితంగా షాజహాన్‌: భాజపా

షాజహాన్‌ షేక్‌ మంగళవారం రాత్రి నుంచి బెంగాల్‌ పోలీసుల ‘సురక్షిత కస్టడీ’లోనే ఉన్నారని భాజపా నేత సువేందు అధికారి చెప్పారు. సురక్షితంగా చూసుకోవాలనే ఒప్పందాన్ని శక్తిమంతులైన మధ్యవర్తుల ద్వారా కుదుర్చుకుని ఇలా కస్టడీలోకి వెళ్లినట్లు తెలిపారు. అయిదు నక్షత్రాల హోటల్‌ తరహా సదుపాయాలన్నీ అతనికి లభించనున్నాయని, అవసరాన్నిబట్టి వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వాసుపత్రిలో ఒక పడకనూ ప్రత్యేకించారని వెల్లడించారు. ఇదంతా నిరాధారమని అధికార తృణమూల్‌ ఖండించింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

..నాకు వణుకు పుడుతోంది: నిర్మల

మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. కోల్‌కతాలో భాజపా అనుబంధ సాంస్కృతిక బృందం ఏర్పాటు చేసిన ‘ఖోలా హవా’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘సందేశ్‌ఖాలీలో దారుణాల గురించి వింటుంటే నాకు వణుకు పుడుతోంది. ఇంత జరిగినా నిందితుడిని అరెస్టు చేయలేదు. షాజహాన్‌ షేక్‌ ఎక్కడున్నాడో వారికి తెలుసు. లేదంటే వారం రోజుల్లోగా అరెస్టు చేస్తామని ఎలా చెప్పగలిగారు?’’ అని ఆమె ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీలో హింసకు నిరసనగా కోల్‌కతాలో భాజపా బుధవారం రెండు రోజుల ధర్నాకు దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని