భార్య ఆత్మహత్య కేసులో 30 ఏళ్లకు.. భర్త నిర్దోషిగా తీర్పు

భార్య ఆత్మహత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఓ వ్యక్తి 30 ఏళ్లు సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.

Published : 29 Feb 2024 04:26 IST

దిల్లీ: భార్య ఆత్మహత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఓ వ్యక్తి 30 ఏళ్లు సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. నేరం జరిగితే చట్టపరమైన సాక్ష్యాల ఆధారంగానే శిక్షను నిర్ధరించాలని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హరియాణాకు చెందిన నరేశ్‌కుమార్‌ అనే వ్యక్తి భార్య 1993లో ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు డబ్బుల కోసం ఆమెను వేధించారన్న ఆరోపణలతో నరేశ్‌పై ఐపీసీ సెక్షన్‌ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 1996లో ట్రయల్‌ కోర్టు నరేశ్‌ను దోషిగా తేల్చింది. ఈ తీర్పుపై ఆయన పంజాబ్‌, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా..  అక్కడా చుక్కెదురైంది. ట్రయల్‌ కోర్టు తీర్పునే హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా అతడు నిర్దోషిగా ప్రకటించిన ధర్మాసనం ట్రయల్‌ కోర్టు తీర్పును, శిక్షను రద్దు చేసింది. ‘‘ఈ కేసు 1993లో మొదలై 2024లో ముగిసింది. దాదాపు 30 ఏళ్లు అతడు బాధపడ్డాడు. అంతేకాకుండా ఆర్నెల్ల చిన్నారిని వదిలి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు కోణాల్లోనూ ఆలోచించి తీర్పు ఇచ్చాం. ఆత్మహత్యకు వేధింపులే కారణమని ఊహించకూడదు’’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని