అఖిలేశ్‌ యాదవ్‌కు సీబీఐ సమన్లు

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ సమన్లు పంపింది.

Published : 29 Feb 2024 05:12 IST

అక్రమ మైనింగ్‌ కేసులో సాక్ష్యమివ్వడానికి దిల్లీ రావాల్సిందిగా నోటీసులు

దిల్లీ/లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ సమన్లు పంపింది. అక్రమ మైనింగ్‌ కేసులో సాక్ష్యమిచ్చేందుకు గురువారం దిల్లీలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేసింది. రూ.100 కోట్ల విలువైన ఈ అక్రమ మైనింగ్‌ కుంభకోణానికి సంబంధించి.. 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. గనుల తవ్వకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) నిషేధం ఉన్నా, 2012-16 మధ్య కాలంలో అక్రమ మైనింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడమే కాకుండా లైసెన్సులు పునరుద్ధరించారన్నది ఆరోపణ. ఆ సమయంలో అఖిలేశ్‌ సీఎంగా ఉన్నారు. 2012-13లో గనుల శాఖ మంత్రిగానూ వ్యవహరించారు. 2013 ఫిబ్రవరిలో మంత్రిగా అఖిలేశ్‌ 14 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. ఆ నెల 17వ తేదీన ఏకంగా 13 ప్రాజెక్టుల లీజుపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సీఎం కార్యాలయం నుంచి రాగానే ఈ-టెండరింగ్‌ ప్రక్రియ నిబంధనలు ఉల్లంఘించి హమీర్‌పుర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ బి.చంద్రకళ లీజులను సంబంధిత వ్యక్తులకు అప్పగించారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఐఏఎస్‌ అధికారి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్‌ కుమార్‌ మిశ్ర సహా మొత్తం 11 మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.

నోటీసులు సాధారణమే

ఎన్నికలకు ముందు నోటీసులు సాధారణమేనని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ‘‘భాజపా లక్ష్యమే మా పార్టీ. 2019 ఎన్నికల ముందు కూడా నోటీసిచ్చింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి. అందుకే నోటీసులు వచ్చాయి. గత పదేళ్లుగా భాజపా అభివృద్ధి చేసి ఉంటే, ఎందుకు అంతగా ఆందోళన చెందుతోంది’’అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని